RV Karnan: హైదరాబాద్‌లో కొందరు కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నారు: జీహెచ్ఎంసీ కమిషనర్

RV Karnan Some in Hyderabad are paying less property tax than required says GHMC Commissioner
  • పరిశుభ్రతలో నగరాన్ని అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యమన్న ఆర్వీ కర్ణన్
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ ఆరో ర్యాంకు సాధించిందన్న కర్ణన్
  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2 వేల కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడి
హైదరాబాద్ నగరంలో కొందరు ఆస్తి పన్నును తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆస్తి పన్ను వసూళ్లపై భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.3,000 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఇప్పటికే రూ.1,512 కోట్లు వసూలు చేశామని, ఇది గత ఏడాదితో పోలిస్తే 8 శాతం అధికమని ఆయన వెల్లడించారు.

నగరంలో ఇటీవల నిర్వహించిన జీఐఎస్ ఆధారిత సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఈ సర్వేలో 1.02 లక్షలకు పైగా ఆస్తులు పన్ను పరిధిలో లేవని లేదా తక్కువ పన్ను చెల్లిస్తున్నాయని గుర్తించినట్లు వివరించారు. ఈ ఆస్తుల ద్వారా అదనంగా రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని, ఈ అంచనాలతోనే వచ్చే ఏడాది లక్ష్యాన్ని పెంచినట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో, ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయిన వారికి జీహెచ్‌ఎంసీ 'వన్-టైమ్ సెటిల్మెంట్' (ఓటీఎస్) పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద, పేరుకుపోయిన వడ్డీలో 10% మొత్తాన్ని అసలుతో పాటు ఒకేసారి చెల్లిస్తే, మిగిలిన 90% వడ్డీని మాఫీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి కొత్తగా వచ్చిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ ఓటీఎస్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా రూ.2,000 కోట్ల మైలురాయిని దాటి రికార్డు స్థాయిలో పన్ను వసూలు చేసింది. పెరిగిన ఆదాయంతో నగరంలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పరిశుభ్రతలో నగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో కృషి చేస్తామని ఆయన అన్నారు. 2025 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ ఆరో ర్యాంకును సాధించిందని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు విస్తరించిందని అన్నారు.

వార్డులు కూడా 150 నుంచి 300కు పెరిగాయని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3 వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

జీఐఎస్ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగర పౌరులు తమ ఆస్తి పన్నును నేరుగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్, యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. హైదరాబాద్ నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపర్చేందుకు పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు.
RV Karnan
GHMC
Hyderabad
Property Tax
Swachh Sarvekshan
GIS Survey
Flyovers
Sanitation

More Telugu News