AR Rahman: తొలిసారిగా నటుడిగా కెమెరా ముందుకు వస్తున్న ఏఆర్ రెహ్మాన్... ఎవరి సినిమాలోనో తెలుసా?

AR Rahman to Act in Moonwalk Movie with Prabhu Deva
  • ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న 'మూన్‌వాక్' చిత్రం
  • ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇస్తున్న ఏఆర్ రెహమాన్
  • కోపమున్న యువ దర్శకుడి పాత్రలో కనిపించనున్న ఆస్కార్ విన్నర్
  • సినిమాలోని మొత్తం 5 పాటలను స్వయంగా పాడిన రెహమాన్
  • 2026 మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. దశాబ్దాలుగా తన సంగీతంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ఆయన, ఇప్పుడు వెండితెరపై నటుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో మనోజ్ ఎన్.ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మూన్‌వాక్' చిత్రంలో రెహమాన్ నటించనున్నారు. బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్లు తాజాగా విడుదలై ఆసక్తిని రేపుతున్నాయి.

విశేషమేమిటంటే.. ఈ చిత్రంలో రెహమాన్ సంగీత దర్శకుడిగా కాకుండా, ఒక కల్పిత పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఇందులో ఓ 'కోపమున్న యువ దర్శకుడి' (Angry Young Film Director) పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాకుండా, తన కెరీర్లో తొలిసారిగా ఈ సినిమాలోని మొత్తం ఐదు పాటలను రెహమానే స్వయంగా పాడటం మరో విశేషం.

ఈ సందర్భంగా దర్శకుడు మనోజ్ ఎన్.ఎస్ మాట్లాడుతూ.. "ప్రభుదేవా, ఏఆర్ రెహమాన్‌లతో కలిసి 'మయిలే' అనే పాటను షూట్ చేయడం అద్భుతమైన అనుభవం. ఈ పాటలో రెహమాన్ సార్ కనిపిస్తారు. ఆ తర్వాత నేను చెప్పిన కథ నచ్చడంతో ఆయన సినిమాలో ఒక పూర్తి స్థాయి సన్నివేశంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా సర్ ప్రైజ్ ఇస్తుంది" అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ప్రభుదేవా 'బాబుట్టి' అనే యువ కొరియోగ్రాఫర్ పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ యోగి బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో (కవరిమాన్ నారాయణన్, ఆట్టుక్కాల్ అళగు రాజా, దుబాయ్ మాథ్యూ) కనిపించనున్నారు. వీరితో పాటు అర్జున్ అశోక్, అజు వర్గీస్, రెడిన్ కింగ్స్ లే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


AR Rahman
AR Rahman movie
Moonwalk movie
Prabhu Deva
Manoj NS director
Yogi Babu
Tamil movie
Behindwoods Productions
Tamil cinema
Babutti character

More Telugu News