Madras High Court: ప్రేమ పెళ్లిళ్లు 'స్టాక్ మార్కెట్' లాంటివి.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Madras High Court calls love marriages like stock market
  • ప్రేమ వివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం
  • తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు
  • యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
  • పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన
ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు 'స్టాక్ మార్కెట్' లాంటివని, వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ వేలుమురుగన్, జస్టిస్ జ్యోతిరామన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి గత నెలలో అకస్మాత్తుగా అదృశ్యమైంది. తన కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానిస్తూ ఆమె తండ్రి కరుప్పన్నన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సదరు యువతి.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనతో పాటు పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని ఇష్టపడి వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు యువతికి పలు సూచనలు చేశారు. "తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుని ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. మీకు నచ్చిన వ్యక్తితో వెళ్లడం మీ వ్యక్తిగత హక్కు అయినప్పటికీ, కన్నవారి మనోభావాలను గౌరవించాలి. చదువుకున్న మీరు ఈ విషయాన్ని వారికి ముందే చెప్పి ఒప్పించాల్సింది" అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల ఇష్టాలను అర్థం చేసుకోవాలని సూచించారు.

తమను చూసే దిక్కు లేదని, వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏంటని యువతి తల్లిదండ్రులు కోర్టులో కన్నీరుమున్నీరయ్యారు. అయితే, ఆ యువతి మేజర్ అని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నందున ఆమె నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్తతో వెళ్లేందుకు యువతికి అనుమతినిస్తూ కేసును మూసివేసింది.
Madras High Court
love marriages
stock market
Madurai Bench
Justice Velumurugan
Justice Jyothiraman
habeas corpus
nurse missing
Tamil Nadu
court comments

More Telugu News