India Economy: జపాన్‌ను వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మ‌న‌దే!

India Overtakes Japan To Become Worlds Fourth Largest Economy Eyes Third Spot By 2030
  • 2030 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరే అవకాశం
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి
  • భారత వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ సహా అంతర్జాతీయ సంస్థల సానుకూల అంచనాలు
  • అదుపులోనే ద్రవ్యోల్బణం.. మెరుగుపడుతున్న ఎగుమతుల పనితీరు
భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రస్తుతం భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడిపీ) విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే 2030 నాటికి జర్మనీని కూడా అధిగమించి.. అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని తెలిపింది. దశాబ్దం చివరి నాటికి భారత జీడిపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీడిపీ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 7.8 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. గడచిన ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం. ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడిందని ప్రభుత్వం పేర్కొంది. దేశీయంగా ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపింది.

భారత ఎకానమీపై మూడీస్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు సానుకూలత వ్యక్తం చేశాయి. వినియోగదారుల డిమాండ్ బలంగా ఉందంటూ 'ఫిచ్' రేటింగ్స్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.4 శాతానికి పెంచగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 2025 అంచనాను 7.2 శాతానికి సవరించింది. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎగుమతులు మెరుగుపడటంతో పాటు వాణిజ్య రంగానికి రుణాల పంపిణీ బాగుండటం ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తోంది.
India Economy
Indian Economy
GDP
Gross Domestic Product
Economic Growth
World Bank
IMF
Fitch Ratings
ADB
Asian Development Bank

More Telugu News