Vijayawada Durga Temple: విజయవాడ దుర్గగుడిలో తలనీలాల వేలానికి రికార్డు ధర

Vijayawada Durga Temple Hair Auction Fetches Record Price
  • రూ.10.10 కోట్లకు హక్కులు దక్కించుకున్న ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌
  • వివిధ రాష్ట్రాల నుంచి పోటీపడిన 19 మంది కాంట్రాక్టర్లు
  • గతంలో రూ.5.67 కోట్లు కాగా ఈసారి రెట్టింపైన ఆదాయం
  • తర్వాతి ఏడాదికి 10 శాతం పెంపుతో రూ.11.11 కోట్లుగా ఖరారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో తలనీలాల వేలం పాట రికార్డు సృష్టించింది. భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే తలనీలాలను సేకరించే హక్కులకు సంబంధించి ఆలయ అధికారులు నిర్వహించిన వేలం పాటలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధర పలికింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ‘ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌’ సంస్థ రూ.10.10 కోట్లకు ఈ టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది.

రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో తలనీలాల సేకరణ ద్వారా ఆలయానికి రూ.5.67 కోట్లు మాత్రమే రాగా, ఈసారి అది దాదాపు రెట్టింపు కావడం విశేషం. తాజా ఒప్పందం ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.10.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి ఏడాది (2027-28)కి మరో 10 శాతం అదనంగా, అంటే రూ.11.11 కోట్లకు టెండర్ ఖరారైంది. దుర్గగుడిలోని మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఈ వేలం పాటను అధికారులు నిర్వహించారు.

ఈ వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్, ఈ-టెండర్ విధానాల్లో బిడ్లను ఆహ్వానించారు. ఇందులో నలుగురు సీల్డ్ టెండర్లు వేయగా, బహిరంగ వేలంలో ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అత్యధిక ధరను కోట్ చేసి హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆలయ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Durga Temple
Durga Temple
Vijayawada
Kanaka Durga
Hair Auction
Indian Hair Industries
Tender
Temple Revenue
Andhra Pradesh Temples
Tanuuku

More Telugu News