Immigrants: అమెరికాలో గుమ్మం దాటాలంటే భయపడుతున్న వలసదారులు

Immigrants in America fear crossing the doorstep
  • వీసాలపై ఆంక్షలతో ఇళ్లకే పరిమితమవుతున్న వైనం
  • దేశం దాటడం కాదు పొరుగు రాష్ట్రానికి వెళ్లాలన్నా భయమే
  • అధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఇమిగ్రెంట్లు
అమెరికా ప్రభుత్వం వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటం, వీసాలపై ఆంక్షలు విధించడంతో అక్కడి వలసదారులు ఆందోళన చెందుతున్నారు. స్వదేశాలకు వెళ్లడం సంగతి పక్కన పెడితే పొరుగు రాష్ట్రంలోని బంధువుల ఇంటికి వెళ్లాలన్నా జంకుతున్నారు. గుమ్మం దాటాలంటేనే టెన్షన్ గా ఉందని పలువురు వలసదారులు వాపోతున్నారు. చట్టప్రకారమే అమెరికాలో అడుగుపెట్టినా సరే వీసా రూల్స్ లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో.. అధికారులు ఏం మెలికపెట్టి డిపోర్ట్ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

ఎంతో సందడిగా జరిగే క్రిస్మస్ ఈసారి వలసదారులకు ఎలాంటి ఉత్సాహాన్ని కలిగించలేకపోయింది. కొత్త ఏడాది హాలీడే సీజన్‌ కూడా నిస్సారంగానే గడిచిపోతోందని వాపోతున్నారు. వరుస సెలవులు వచ్చినా పర్యటనలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేకమంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌, కేఎఫ్‌ఎఫ్‌ సర్వేలో వెల్లడైంది.

ప్రతీ పదిమంది వలసదారులలో ముగ్గురు తమ ప్రయాణాలను రద్దు చేసుకుని ఇళ్లకే పరిమితం అవుతున్నామని చెప్పారని, దీనికి ప్రధాన కారణం ఇమిగ్రేషన్‌ అధికారుల దృష్టిలో పడకుండా ఉండాలనేదేనని సర్వేలో తేలింది. హెచ్‌-1బీ వీసాదారుల్లో 32 శాతం మంది, అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో 15 శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట.

సరైన పత్రాలు లేని వలసదారుల్లో ఏకంగా 63 శాతం మంది ఇళ్లల్లోనే ఉంటున్నారట. హెచ్‌-1బీ సహా పలు వీసాల నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప విదేశాలకు వెళ్లొద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్చరించాయి. చెల్లుబాటయ్యే వీసా ఉన్నప్పటికీ దేశం దాటితే తిరిగి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపాయి. వీసా స్టాంపింగ్ ఆలస్యమైతే అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
Immigrants
USA
America
H1B Visa
Visa Rules
Immigration
Travel Restrictions
Indian Immigrants
Deportation
Immigration Officers

More Telugu News