Biryani Ice Cream: ఇదెక్కడి వంటకంరా బాబూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బిర్యానీ ఐస్‌క్రీమ్'!

Biryani Ice Cream Viral Food Experiment Shocks Social Media
  • ఫుడ్ వ్లాగర్ తయారుచేసిన వంటకం 
  • బిర్యానీ దినుసులతోనే ఐస్‌క్రీమ్ తయారీ   
  • ఈ వింత వంటకంపై నెటిజన్ల మిశ్రమ స్పందన 
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఫుడ్ విషయంలో నెటిజన్లు చేసే ప్రయోగాలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరిస్తే, మరికొన్నిసార్లు షాక్‌కు గురిచేస్తాయి. తాజాగా ఆ కోవలోకే వస్తుంది "బిర్యానీ ఐస్‌క్రీమ్". ఈ విచిత్రమైన వంటకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఓ ఫుడ్ వ్లాగర్ ఈ బిర్యానీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేశారు. అచ్చం బిర్యానీకి వాడే దినుసులనే దీని తయారీలోనూ ఉపయోగించడం గమనార్హం. ముందుగా నూనె, ఉప్పు వేసి ఉల్లిపాయలను బ్రౌన్‌గా వేయించారు. ఆ తర్వాత బియ్యాన్ని క్రీమ్‌తో కలిపి ఉడికించారు. అనంతరం ఈ మిశ్రమంలో పంచదార, బిర్యానీ మసాలా, వేయించిన ఉల్లిపాయలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి మిక్సీ పట్టారు.

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి, వచ్చిన ద్రవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టేలా చేశారు. చివరగా దానిపై అలంకరణ కోసం వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి, బాదం పలుకులు చల్లారు. అంతే.. బిర్యానీ ఐస్‌క్రీమ్ సిద్ధమైంది.

ఈ విచిత్ర రెసిపీపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. "దీన్ని ఒకసారి రుచి చూస్తే కానీ నమ్మలేం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇది చూడటానికి వింతగా ఉన్నా, చేసిన విధానం చాలా బాగుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు. "అన్నీ బాగున్నాయి కానీ ఇందులో చికెన్, గుడ్లు, బంగాళాదుంపలు మిస్ అయ్యాయి" అని ఓ నెటిజ‌న్‌ చమత్కరించారు. "ప్రతిదీ చేయగలమని ప్రయోగం చేయకూడదు" అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఈ బిర్యానీ ఐస్‌క్రీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Biryani Ice Cream
Biryani
Ice Cream
Food Experiment
Viral Video
Food Vlogger
Social Media Trend
Indian Cuisine
Weird Food Combination
Food Innovation

More Telugu News