Smriti Mandhana: తిరువనంతపురంలో పరుగుల ప్రవాహం... టీమిండియా మహిళల జట్టు భారీ స్కోరు

Smriti Mandhana leads India Women to Huge Score Against Sri Lanka
  • శ్రీలంకతో నాలుగో టీ20లో భారత మహిళల బ్యాటింగ్ విధ్వంసం
  • ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మల అద్భుత హాఫ్ సెంచరీలు
  • నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు
  • భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతున్న శ్రీలంక
శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (80), షఫాలీ వర్మ (79) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి మెరుపులకు చివర్లో రిచా ఘోష్ (40 నాటౌట్) దూకుడు తోడవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. అయితే, వారి నిర్ణయం తప్పని నిరూపిస్తూ భారత ఓపెనర్లు స్మృతి, షఫాలీ ఆరంభం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. 46 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో షఫాలీ 79 పరుగులు చేయగా, 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో స్మృతి 80 పరుగులు సాధించింది.

ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.

అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా దూకుడుగానే ఛేదనను ప్రారంభించింది. తాజా సమాచారం అందేసరికి 3.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసి గట్టి పోటీ ఇస్తోంది. క్రీజులో హసిని పెరీరా (32), కెప్టెన్ చమరి అటపట్టు (18) ఉన్నారు.
Smriti Mandhana
India women cricket
Sri Lanka women cricket
Shafali Verma
Richa Ghosh
T20 match
womens cricket
cricket score
Hasini Perera
Chamari Athapaththu

More Telugu News