Droupadi Murmu: ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ సబ్ మెరైన్ లో ద్రౌపది ముర్ము. సముద్ర గర్భంలో సాహస యాత్ర

President Murmu Aboard INS Vagsheer Submarine at Karwar
  • ఐఎన్ఎస్ వాగ్‌షీర్ సబ్ మెరైన్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి మూర్ము
  • కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్ నుంచి ఈ యాత్ర
  • కలాం తర్వాత జలాంతర్గామిలో పర్యటించిన రెండో రాష్ట్రపతిగా రికార్డు
  • భారత రక్షణ సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల సర్వోన్నత అధిపతి, రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్ నుంచి భారత నావికాదళానికి చెందిన స్వదేశీ జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్‌షీర్‌లో ఆమె ప్రయాణించారు. సముద్ర గర్భంలోకి వెళ్లి సబ్ మెరైన్ పనితీరును, భారత నావికాదళ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది మూర్ము రికార్డు సృష్టించారు. గతంలో 2006లో దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జలాంతర్గామిలో ప్రయాణించారు.

ఆదివారం ఉదయం కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతికి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి స్వాగతం పలికారు. అనంతరం ఆమె నావికాదళ యూనిఫాం ధరించి సబ్ మెరైన్‌లోకి ప్రవేశించారు. యాత్ర సందర్భంగా అధికారులు జలాంతర్గామి యొక్క సాంకేతిక నైపుణ్యం, నిఘా వ్యవస్థ, పోరాట సామర్థ్యాలను ఆమెకు వివరించారు. సిబ్బందితో మాట్లాడిన రాష్ట్రపతి, వారి అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు.

'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో దేశీయంగా నిర్మించిన ప్రాజెక్ట్ 75లో భాగంగా రూపొందించిన ఆరవ, చివరి సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వాగ్‌షీర్. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో, ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దంగా పనిచేసే డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములలో ఇది ఒకటి. శత్రు నౌకలను, జలాంతర్గాములను నాశనం చేయగల టార్పెడోలు, క్షిపణులతో ఇది సన్నద్ధమై ఉంది.

ఈ యాత్ర అనంతరం రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఐఎన్ఎస్ వాగ్‌షీర్ భారత నావికాదళ వృత్తి నైపుణ్యానికి, పోరాట సంసిద్ధతకు, జాతీయ భద్రత పట్ల వారి నిబద్ధతకు నిలువుటద్దం" అని రాష్ట్రపతి కొనియాడారు. ఇప్పటికే సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాల్లో ప్రయాణించిన మూర్ము, ఇప్పుడు సబ్ మెరైన్‌లో యాత్ర పూర్తిచేసి సాయుధ దళాల మనోధైర్యాన్ని మరింత పెంచారు. ఈ పర్యటన హిందూ మహాసముద్రంలో భారత వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
Droupadi Murmu
INS Vagsheer
Indian Navy
Submarine
Karnataka
Karwar Naval Base
Kalvari Class Submarine
President of India

More Telugu News