Devarakonda Ravinder: స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధి రాలేదు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య

Online Betting Drives Youth to Suicide in Gajularamaram
  • హైదరాబాద్‌లోని సూరారంలో ఘటన
  • బెట్టింగ్‌లకు బానిసై పెద్దమొత్తంలో అప్పులు 
  • తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య
బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి స్నేహితుడు చనిపోయినా బుద్ధి రాలేదని, తను కూడా అదే మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నానంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. సూరారం తెలుగుతల్లి నగర్‌కు చెందిన దేవరకొండ రవీందర్ (24) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేవాడు. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న రవీందర్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో అప్పులు చేయడంతో వాటిని తీర్చే మార్గం కనిపించక ఒత్తిడికి లోనయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యకు ముందు రవీందర్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. "నా స్నేహితుడు కూడా ఇలాగే బెట్టింగ్‌ల వల్ల చనిపోయాడు. అది చూసి కూడా నాకు బుద్ధి రాలేదు. అత్యాశకు పోయి అప్పులు చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. దయచేసి ఎవరూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడి జీవితాలను పాడుచేసుకోవద్దు" అంటూ ఆ వీడియోలో రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Devarakonda Ravinder
online betting
suicide
loan debt
Gajularamaram
Kuthbullapur
Medchal district
Telugu Thalli Nagar
betting apps

More Telugu News