Mahakaleshwar Temple: ఉజ్జయిని టెంపుల్‌కు భారీ ఎత్తున విరాళాలు

Mahakaleshwar Temple Receives Huge Donations in Ujjain
  • మహాకాళేశ్వరుడిని డిసెంబర్ 15 వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారన్న ఆలయ వర్గాలు
  • వంద కోట్లకు పైగా ఆదాయం లభించిందని వెల్లడి
  • ప్రతి ఏడాదీ ఆలయానికి వచ్చే విరాళాలు పెరుగుతున్నాయన్న ఆలయ కమిటీ
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి భక్తుల నుంచి ఏటా భారీగా విరాళాలు, కానుకలు అందుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 5.5 కోట్ల మంది భక్తులు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో విరాళాల రూపంలో రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వెల్లడించాయి. ఇందులో సుమారు రూ.13 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

శీఘ్ర దర్శనం టికెట్లు, భక్తుల విరాళాలు, కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకాల ద్వారా గత ఏడాది మొత్తం రూ.92 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రూ.107 కోట్లను అధిగమించిందని తెలిపారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. గత ఏడాది శ్రావణంలో రూ.22 కోట్లు రాగా, ఈసారి అదే నెలలో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

ప్రతి సంవత్సరం ఆలయానికి వచ్చే విరాళాలు పెరుగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. భక్తుల భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, సౌకర్యాల విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని పేర్కొంది. సెలవు దినాల్లో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, ముఖ్యంగా క్రిస్మస్ రోజున దాదాపు 2.5 లక్షల మంది భక్తులు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 
Mahakaleshwar Temple
Ujjain
Ujjain Temple
Madhya Pradesh
Temple Donations
Hindu Temple
Temple Revenue
Shravan Month
Indian Temples
Temple Tourism

More Telugu News