Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Salman Khan Receives Birthday Wishes From Chiranjeevi
  • నేడు సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు
  • పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు
  • సల్లూ భాయ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబరు 27) తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 

"నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సల్లూ భాయ్.. ఈ ఏడాది మీకు అంతులేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు అర్హులైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీరు తెరపై లక్షలాది మందికే కాదు, మాలాంటి స్నేహితులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. మరెన్నో ఏళ్లు మీరు సంతోషంగా ఉండాలి... మరెన్నో విజయాలు అందుకోవాలి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు క్రికెటర్ ఎంఎస్ ధోనీ తన కుటుంబంతో పాటు, సంజయ్ దత్, టబు, కరిష్మా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, హ్యూమా ఖురేషి వంటి ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సల్మాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి కేక్ కట్ చేశారు. అయత్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం విశేషం.

అనంతరం సల్మాన్ ఫామ్‌హౌస్ బయటకు వచ్చి, తన కోసం ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులతో కలిసి క్రిస్మస్ థీమ్‌తో ఉన్న మరో కేక్‌ను కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైఫ్, ఆయన బాడీగార్డ్ షేరా వంటి వారు ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా సల్మాన్‌కు గౌరవ సూచకంగా ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌ను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Salman Khan
Chiranjeevi
Salman Khan birthday
Bollywood
Tollywood
MS Dhoni
Katrina Kaif
Panvel farmhouse
Aayat Sharma

More Telugu News