Nagababu: మహిళల దుస్తులపై పెత్తనమేంటి?.. శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్

Nagababu Responds to Shivajis Comments on Womens Clothing
  • హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
  • ఈ వివాదంపై స్పందించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
  • మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని స్పష్టీకరణ
  • నేరాలకు దుస్తులు కాదు.. పురుషుల మనస్తత్వమే కారణమన్న నాగబాబు
  • మహిళలు స్వీయరక్షణపై దృష్టి పెట్టాలని సూచన
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం, వారిపై 'మోరల్ పోలీసింగ్' చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయ‌న‌.. ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని నాగబాబు స్ప‌ష్టం చేశారు. వారి ఎంపికలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళలపై జరిగే హింసకు, నేరాలకు వారి వస్త్రధారణ కారణం కాదని, పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన సమస్య అని ఆయన అన్నారు. "ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు మహిళలపై నేరాలకు, వారి దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాయి" అని నాగబాబు గుర్తుచేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వాలపై ఉందని అన్నారు.

ఈ సందర్భంగా మహిళలకు నాగబాబు ఒక విజ్ఞప్తి చేశారు. "మీకు నచ్చినట్లు ఉండండి, మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. అయితే, మన సమాజంలో మహిళల భద్రతపై ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడే వ‌ర‌కు, మీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకోండి" అని సూచించారు.

ఇటీవల నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందనతో ఈ వివాదం మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే కోణంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Nagababu
Shivaji
dress code
Tollywood
Moral policing
Women safety
Anasuya Bharadwaj
Chinmayi
gender equality
personal freedom

More Telugu News