Amur Falcons: 6,100 కిలోమీటర్ల దూరం ఆగకుండా.. సముద్రాలు దాటిన 'చిట్టి' పక్షులు!

Amur Falcons Tiny Birds Fly 6100 km Non Stop Across Oceans
  • మణిపూర్ నుంచి ఆఫ్రికాకు 6,100 కిలోమీటర్ల దూరాన్ని 6 రోజుల్లోనే పూర్తిచేసిన 'అపాపాంగ్'  
  • తన సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ, మహారాష్ట్రలలో స్వల్ప విరామం తీసుకున్న ‘అలంగ్’ 
  • శాటిలైట్ ట్యాగుల ద్వారా పక్షులను పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు
ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన వలస పక్షులుగా పేరుగాంచిన 'అమూర్ ఫాల్కన్లు' మరోసారి అద్భుతం చేశాయి. మణిపూర్ నుంచి బయలుదేరిన మూడు చిన్న పక్షులు.. అపాపాంగ్, అలంగ్, అహు వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా అధిగమించి ఆఫ్రికా ఖండానికి చేరుకున్నాయి. క్రిస్మస్ వెలుగులతో జింబాబ్వే రాజధాని హరారే నగరం మెరుస్తుంటే ఆ నగరం మీదుగా ఈ చిట్టి అతిథులు ప్రస్తుతం విహరిస్తున్నాయి.

అపాపాంగ్.. ఒక రికార్డు ప్రయాణం
శాటిలైట్ ట్యాగ్ కలిగిన 'అపాపాంగ్' అనే మగ పక్షి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నవంబర్‌లో కేవలం 6 రోజుల్లోనే 6,100 కిలోమీటర్ల దూరాన్ని ఏకధాటిగా ప్రయాణించింది. అరేబియా సముద్రాన్ని, హార్న్ ఆఫ్ ఆఫ్రికాను దాటి నేరుగా కెన్యాలో వాలింది. ఇంత చిన్న పక్షి (దాదాపు 150 గ్రాములు) ఆగకుండా ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయడం ఒక ప్రపంచ రికార్డు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలంగ్, అహు.. భిన్నమైన మార్గాలు
ఆడపక్షి'అలంగ్'(Yellow tag) 5,600 కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా మన తెలంగాణ, మహారాష్ట్రలలో స్వల్ప విరామం తీసుకుని కెన్యా చేరింది. మరో పక్షి 'అహు' (Red tag) బంగ్లాదేశ్ మీదుగా 5,100 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియా చేరుకుంది. ప్రస్తుతం ఇవన్నీ బోట్స్‌వానాలోని ఒకావాంగో డెల్టా వంటి ప్రాంతాల వైపు సాగుతున్నాయి.

జీవవైవిధ్యానికి దర్పణం
వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్త సురేశ్ కుమార్, ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ఈ పక్షుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖండాలను కలిపే ఈ వలస మార్గాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ పక్షుల ప్రయాణం మనకు గుర్తుచేస్తోంది. ఒకప్పుడు ఈ పక్షులను వేటాడే మణిపూర్, నాగాలాండ్ ప్రజలు.. ఇప్పుడు వాటిని సంరక్షిస్తూ 'రక్షకులు'గా మారడం ఈ విజయగాథలో మరో విశేషం.
Amur Falcons
Apapong
Alang
Ahu
bird migration
wildlife
conservation
India
Africa
Nagaland

More Telugu News