Chandrababu Naidu: వాజ్‌పేయి వంటి వారితో రాజకీయం చేసి ఇప్పుడు చిల్లర వ్యక్తులతో చేయాలంటే సిగ్గేస్తోంది: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu Feels Ashamed to Do Politics With Petty People
  • అమరావతిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు
  • జైభారత్, జై తెలుగుతల్లి అంటూ ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • వాజ్‌పేయి, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉందన్న చంద్రబాబునాయుడు
వాజ్‌పేయి వంటి ఉన్నత స్థాయి నాయకులతో రాజకీయం చేసిన తనకు ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్ర ఆగదని, సంపద, ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తినిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజా రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అమరావతిలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాజ్‌పేయి విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జై భారత్, జై తెలుగుతల్లి అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిలో వాజ్‌పేయి జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచమంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు. వాజ్‌పేయి స్మృతివనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్ఫూర్తి అని కొనియాడారు. చరిత్ర గుర్తించే విధంగా వాజ్‌పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే సదుద్దేశంతో స్మృతి వనం నిర్మిస్తున్నట్లు చెప్పారు.

26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్ఠించేలా కూటమి సంయుక్తంగా కృషి చేస్తోందని చంద్రబాబునాయుడు తెలిపారు. అటల్ జన్మదినాన్ని సుపరిపాలన దివస్‌గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. తెలుగు నేలలో కూడా అలాంటి స్ఫూర్తినిచ్చిన నేత ఎన్టీఆర్ అని, వీరంతా చరిత్రను తిరగరాసిన గొప్ప నాయకులని ఆయన అభివర్ణించారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు.

వాజ్‌పేయి, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా ఎంతో కీలకమని ఆయన అన్నారు. వాజ్‌పేయి మంచి వక్తగా, కవిగా, ప్రజాహృదయ నేతగానే కాకుండా దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ-చెన్నైల మధ్య ప్రారంభించామని గుర్తు చేశారు.

దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి వాజ్‌పేయి అని చంద్రబాబు అన్నారు. కార్గిల్ యుద్ధం ద్వారా వాజ్‌పేయి, సింధూర్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. అబ్దుల్ కలాం, వాజ్‌పేయి ఇద్దరూ దేశం కోసం నిరంతరం శ్రమించిన మహానుభావులని అన్నారు. దేశం మెచ్చిన నేతగా వాజ్‌పేయి చిరస్మరణీయులని, అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వంటి మహనీయులకు కూడా అమరావతిలో స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన సంస్కరణలతో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ అగ్రస్థానం దిశగా వేగంగా పయనిస్తోందని చంద్రబాబునాయుడు అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని శిఖరాగ్రంలో నిలిపే శక్తి నరేంద్ర మోదీకి ఉందని ఆయన ప్రశంసించారు.

రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ బిహారీ వాజ్‌పేయి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు.

గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలెటర్‌పై ఉందని, ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీపీపీ ద్వారా మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. పీపీపీ అంటే ప్రైవేటు కాదని, ప్రభుత్వ ఆస్తేనని గుర్తించాలని సూచించారు. వాటిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారని తెలిపారు.
Chandrababu Naidu
Vajpayee
Andhra Pradesh
Amaravati
Narendra Modi
TDP
Atal Bihari Vajpayee

More Telugu News