Gumlapur: ఈ రెండు గ్రామాలు సేమ్ టు సేమ్

Twin Villages Gumlapur Venkatapur in Karimnagar District
  • వీధుల నుంచి విగ్రహాల వరకూ అన్నింటా సారూప్యం
  • హైవేకు ఒకవైపు గుంలాపూర్, మరోవైపు వెంకటాపూర్
  • ఇళ్లు, స్కూళ్లు, ఆలయాలు.. అన్నీ ఒకేలా కనిపించడం విశేషం
ఆ రెండు గ్రామాలు కవలల్లాగా ఒకేలా కనిపిస్తాయి. వీధుల నుంచి విగ్రహాల దాకా, భౌగోళికంగా చూసినా.. నిర్మాణాల పరంగా చూసినా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఆ రెండు ఊళ్లలో ఏ ఊళ్లోకి అడుగుపెట్టినా కొత్తవారు ఆశ్చర్యపోవడం ఖాయం.. అవే కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలోని గుంలాపూర్, వెంకటాపూర్ గ్రామాలు. జగిత్యాల-నిజామాబాద్‌ జాతీయ రహదారికి ఇరువైపులా ఉండే ఈ గ్రామాల మధ్య ఉన్న ఈ సారూప్యతలు అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి.

గుంలాపూర్‌ లో అడుగుపెట్టే వారికి అంబేడ్కర్‌ విగ్రహం స్వాగతం పలుకుతుంది. కాస్త ముందుకు వెళితే పంచాయతీ ఆఫీసు, చెరువు, దాని ఒడ్డున ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి. ఇదేవిధంగా వెంకటాపూర్‌ గ్రామంలోకి ప్రవేశించాక మహాత్మా గాంధీ విగ్రహం స్వాగతిస్తుంది. ఎడమ వైపు పంచాయతీ ఆఫీసు, దాని వెనకనున్న కాలనీ మీదుగా వెళ్తే చెరువు, దాని ఒడ్డున ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ శివార్లలో రెండు గుట్టలు, వాటిపై శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు కనిపిస్తాయి.

గుంలాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి సందర్భంగా వారం రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వెంకటాపూర్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా కార్తికమాసంలో వారం రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండేళ్ల కిందట వెంకటాపూర్ లో గ్రామ యువకులు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. తాజాగా గుంలాపూర్ యువకులు కూడా తమ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గుంలాపూర్‌ లో 532 కుటుంబాలు ఉండగా.. జనాభా 1,775. వెంకటాపూర్‌లో 680 కుటుంబాలు, 2001 మంది జనాభా ఉన్నారు.
Gumlapur
Gumlapur village
Venkatapur
Venkatapur village
Karimnagar
Korutla
Telangana villages
Twin villages
Similarity
Village comparison

More Telugu News