Donald Trump: టెక్ కంపెనీలకు ట్రంప్ భారీ షాక్: H-1B వీసా ఫీజు పెంపునకు ఫెడరల్ కోర్టు గ్రీన్ సిగ్నల్!

Donald Trump H 1B Visa Fee Hike Approved by US Court
  • అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు 
  • లక్ష డాలర్లకు చేరనున్న కొత్త దరఖాస్తు రుసుము
  • లాటరీ విధానం రద్దుకు రంగం సిద్ధం 
  • ఇక మెరిట్ ప్రాతిపదికన వీసాల ఎంపిక
అమెరికాలో స్థిరపడాలని కలలు కనే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కొత్త హెచ్-1బి (H-1B) వీసా దరఖాస్తులపై ఏకంగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 85 లక్షలు) భారీ రుసుమును విధించేందుకు ఫెడరల్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ పెంపును సవాల్ చేస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తిరస్కరించారు. ఆర్థిక, జాతీయ భద్రత దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ప్రస్తుతం హెచ్-1బి వీసా ఫీజులు 2,000 నుంచి 5,000 డాలర్ల మధ్య ఉన్నాయి. దీన్ని ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడం వల్ల అమెరికాలోని చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం భారంగా మారనుంది. అమెరికా కంపెనీలు గ్లోబల్ టాలెంట్‌ను వాడుకోకుండా ఈ నిర్ణయం అడ్డుపడుతుందని వాణిజ్య మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, అమెరికా పౌరులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం దక్కాలన్న ట్రంప్ విధానాలకు ఈ తీర్పు ఊతమిచ్చినట్లయింది.

ఫీజుల పెంపుతో పాటు వీసా ఎంపిక ప్రక్రియలోనూ ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 'లాటరీ' విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త వెయిటెడ్ మోడల్‌ను తీసుకురానుంది. అత్యధిక నైపుణ్యం ఉండి, ఎక్కువ వేతనం పొందే అభ్యర్థులకే ఇకపై వీసాలు దక్కనున్నాయి. ఈ కొత్త నిబంధన 2026, ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి రానుంది.

కోర్టు తీర్పుపై ఐటీ కంపెనీలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికా టెక్ రంగం వెనుకబడిపోతుందని అవి హెచ్చరిస్తున్నాయి. ఫెడరల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇతర డెమొక్రటిక్ రాష్ట్రాలు, కార్మిక సంఘాలు కూడా ఈ ఫీజు పెంపును వ్యతిరేకిస్తుండటంతో, ఈ వివాదం చివరకు అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉంది.  
Donald Trump
H-1B Visa
US Chamber of Commerce
Visa Fee Hike
United States
Immigration
Federal Court
IT Companies
Beryl Howell
Immigration Policy

More Telugu News