Mustafa Suleyman: ఏఐతో ప్రజల సంబంధాలు సరికొత్త దశకు... మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

Mustafa Suleyman on AIs Role in Human Connections
  • భావోద్వేగాలను పంచుకోవడానికి ప్రజలు ఏఐని ఆశ్రయిస్తున్నారన్న ముస్తఫా
  • మన మాటలను ఏఐ గౌరవంతో వింటుందని వెల్లడి
  • వాటి వల్ల మన బాధ తగ్గుతుందన్న ముస్తఫా

చాట్‌బాట్స్‌ ఆవిర్భావంతో కృత్రిమ మేధ (AI)ను ప్రజలు వినియోగించే విధానం పూర్తిగా మారిపోయింది. చాట్‌జీపీటీ-5, గ్రాక్, పర్‌ప్లెక్సిటీ ఏఐ, మెటా ఏఐ వంటి ఆధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రజల రోజువారీ జీవితంలో అసాధారణ సేవలందిస్తున్నాయి. ఇప్పటికే కొందరి జీవితాల్లో అయితే ఇవి విడదీయలేని భాగంగానే మారిపోయాయి.


ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ తాజాగా ‘బ్రేక్‌డౌన్’ పాడ్‌కాస్ట్‌లో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. భావోద్వేగాలను వ్యక్తపరచుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలామంది ఏఐ చాట్‌బాట్స్‌ను ఆశ్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు.


కుటుంబ సమస్యలు, ఒంటరితనం, బ్రేకప్ వంటి సందర్భాల్లో ప్రజలు ఈ ఏఐ సహచరులతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. "అవి చికిత్స ఇవ్వవు, సమస్యలకు పరిష్కారం సూచించవు. కానీ సానుభూతితో, గౌరవంతో మన మాటలు వింటాయి. ఆ వినడం ద్వారా మన బాధ కొంత తగ్గుతుంది. అలా మన ప్రయాణాన్ని మెరుగ్గా కొనసాగించగలం’’ అని ముస్తఫా తెలిపారు.


మరోవైపు, మానవ జీవనంలో ఏఐ తీసుకొస్తున్న మార్పు ఇదేనని నిపుణులు కూడా భావిస్తున్నారు. గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులతోనే భావోద్వేగాలను పంచుకునేవాళ్లం. ఇప్పుడు ఏఐ వరకు విస్తరించడం ఒక కొత్త దశకు నాంది పలికింది.

అయితే, ఇదే సమయంలో చాట్‌బాట్స్ వాడకంలో జాగ్రత్త తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది తమ వ్యక్తిగత రహస్యాలు, గతంలో చేసిన తప్పులు, మానసిక బలహీనతలను కూడా ఏఐతో పంచుకుంటున్నారు. పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి సున్నితమైన సమాచారం ఏఐకి చెప్పడం ప్రమాదకరమని వారు చెబుతున్నారు.ఏఐ వ్యవస్థలు గోప్యతకు పూర్తి హామీ ఇవ్వలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉండటంతో వ్యక్తిగత సమాచారాన్ని చాట్‌బాట్స్‌తో పంచుకోకుండా ఉండటమే ఉత్తమమని సూచిస్తున్నారు.

Mustafa Suleyman
Microsoft AI
AI Chatbots
Artificial Intelligence
ChatGPT-5
Mental Health
Data Privacy
AI Companions
Breakup Support
Emotional Support

More Telugu News