Virender Sejwal: ప్రయాణికుడి ముక్కు బద్దలుగొట్టిన పైలట్‌కు ఎయిర్ ఇండియా నోటీసులు

Air India Issues Notice to Pilot Who Broke Passengers Nose
  • 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
  • విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • పైలట్‌ను ఇప్పటికే విధుల నుంచి తప్పించిన ఎయిర్‌లైన్స్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో ప్రయాణికుడిపై భౌతిక దాడికి పాల్పడిన ఘటనను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీవ్రంగా పరిగణించింది. సదరు పైలట్ కు అధికారికంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన ప్రవర్తనపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పైలట్ దురుసు ప్రవర్తన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసిందని పేర్కొంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ నోటీసు ఇచ్చింది. దీనిపై ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు ఈ వారమే ఒక 'ఎక్స్‌టర్నల్ ఎంక్వైరీ కమిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి. బాధితుడు అంకిత్ దేవాన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే పైలట్‌పై స్వచ్ఛందంగా గాయపరచడం, అక్రమంగా అడ్డుకోవడం వంటి అభియోగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే? 
డిసెంబర్ 19న టెర్మినల్-1 వద్ద సెక్యూరిటీ చెక్ లైన్‌లో నిలబడే విషయంలో పైలట్ వీరేందర్ సెజ్వాల్‌కు, ప్రయాణికుడు అంకిత్ దేవాన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో డ్యూటీలో లేని పైలట్, విచక్షణ కోల్పోయి అంకిత్‌ను బలంగా కొట్టారు. ఈ దాడిలో అంకిత్ ముక్కు ఎముక విరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అంకిత్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. పైలట్ ఒక 'వర్క్‌మెన్' కేటగిరీ కిందకు వస్తాడు కాబట్టి, కార్మిక చట్టాల ప్రకారం ఆయనపై విచారణ ప్రక్రియను ప్రారంభించామని సంస్థ తెలిపింది. విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై నివేదిక కోరడంతో పైలట్‌ను ఇప్పటికే విధుల నుంచి తొలగించారు.
Virender Sejwal
Air India Express
Pilot assault
Passenger fight
IGI Airport Delhi
Ankit Devan
Air India notice
Airline investigation
Delhi Police FIR
Indira Gandhi International Airport

More Telugu News