Viral Video: ‘ధురంధర్’కు భారీ క‌లెక్ష‌న్స్‌.. సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలంటూ పాక్ ప్ర‌జ‌ల డిమాండ్‌.. కార‌ణ‌మిదే!

Aditya Dhars Dhurandhar Faces Demand for Profit Sharing from Pakistani Locals
  • ల్యారీ ప్రాంత‌ నేపథ్యంతో తెరకెక్కిన‌ ‘ధురంధర్’ కు భారీ క‌లెక్ష‌న్స్‌
  • మూవీలో తమ ప్రాంతాన్ని చూపించి కోట్లు సంపాదిస్తున్నారంటున్న స్థానికులు
  • సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలంటూ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధర్‌ను కోరుతున్న వైనం
  • 50 శాతం నుంచి 80 శాతం వరకు లాభాల డిమాండ్
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని ల్యారీ (Lyari) ప్రాంతానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన చిత్రం ‘ధురంధర్’ తమ ప్రాంతాన్ని నేపథ్యంగా చూపించిందని పేర్కొంటూ, ఆ సినిమా లాభాల్లో తమకూ వాటా ఇవ్వాలని ల్యారీ వాసులు డిమాండ్ చేయడం ఈ వీడియోలో ఉంది.

'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా షేర్ అయిన ఈ ఒక నిమిషం 34 సెకన్ల నిడివి క‌లిగిన‌ వీడియోలో ల్యారీకి చెందిన పలువురు స్థానికులు మాట్లాడ‌టం మ‌నం చూడొచ్చు. “మన ఊరిని సినిమాలో చూపిస్తే, దానివల్ల లాభపడేది మనమే కదా? అలాంటప్పుడు సినిమా లాభాల్లో మనకు వాటా ఎందుకు ఇవ్వకూడదు?” అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మరో వ్యక్తి అయితే మరింత ముందుకెళ్లి, సినిమా లాభాల్లో కనీసం 80 శాతం ల్యారీ ప్రజలకు ఇవ్వాలని సూచించాడు. “ఆయన సినిమాలు ఇంకా చేస్తూనే ఉంటారు. ఒక సినిమాకు 80 శాతం ఇస్తే ఆయనకు పెద్ద నష్టం ఏమీ కాదు” అంటూ వ్యాఖ్యానించాడు.

ఇంకొంతమంది ల్యారీ వాసులు మాత్రం కొంత మితంగా స్పందించారు. కనీసం 50 శాతం లాభాలు ఇవ్వాలంటూ ఒకరు చెప్పగా, మరికొందరు “5 కోట్లు”, “20 కోట్లు” అంటూ అంచనాలు వేశారు. ఆ డబ్బును ఆసుప‌త్రి వంటి ప్రజా అవసరాల కోసం ఉపయోగించవచ్చని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. చివరికి ఓ వ్యక్తి “12 కోట్లు అయితే సరిపోతాయి” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇక‌, డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఈ సినిమా కథ 1999 నుంచి 2009 మధ్యకాలంలో ల్యారీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్లు, ఉగ్రవాదం, డ్రగ్స్ వ్యాపారం, పోలీసుల దాడులు వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది.

అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాలో కనిపించే ల్యారీ ప్రాంతాన్ని నిజంగా అక్కడ షూట్ చేయకుండా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్టును నిర్మించి తెరకెక్కించారు. ల్యారీని అచ్చుగుద్దినట్టుగా సెట్స్ ను రూపొందించడంతో సినిమా నిర్మాణ విలువలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Viral Video
Aditya Dhar
Dhurandhar movie
Lyari Karachi
Pakistan
Bollywood movie
Ranveer Singh
Akshay Khanna
Gang wars
Drugs trade

More Telugu News