Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ సర్కార్‌కు ఎదురుదెబ్బ!

Donald Trump Suffers Setback in US Supreme Court
  • నేషనల్ గార్డ్ మోహరింపుపై స్టే
  • 6-3 మెజారిటీతో కీలక తీర్పు 
  • ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయమన్న ఇల్లినాయ్ గవర్నర్
ఇల్లినాయ్ రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్ బలగాలను పంపాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 6-3 ఓట్ల తేడాతో ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇల్లినాయ్ లో చట్టాలను అమలు చేయడానికి మిలిటరీని ఉపయోగించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందో నిరూపించడంలో యంత్రాంగం విఫలమైందని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ వివాదం అక్టోబర్ 4న మొదలైంది. షికాగో పరిసర ప్రాంతాల్లో భద్రత కోసం ఇల్లినాయ్ నేషనల్ గార్డ్‌కు చెందిన 300 మంది సభ్యులను ట్రంప్ ఫెడరల్ సర్వీసులోకి పిలిచారు. ఆ తర్వాతి రోజే టెక్సాస్ నేషనల్ గార్డ్‌ను కూడా షికాగోకు పంపారు. అయితే, ఫెడరల్ బలగాల మోహరింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలోనే జిల్లా కోర్టు, అప్పీల్ కోర్టు స్టే ఇచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ స్టేను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

కోర్టు తీర్పుపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగైల్ జాక్సన్ స్పందిస్తూ.. ఫెడరల్ భవనాలు, ఆస్తులను అల్లరిమూకల నుంచి రక్షించడానికి, ఫెడరల్ అధికారులకు రక్షణ కల్పించడానికే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని సమర్థించుకున్నారు. బలగాల మోహరింపును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఇల్లినాయ్ డెమొక్రాటిక్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్, షికాగో మేయర్ ఈ తీర్పును స్వాగతించారు. "ఇది ఇల్లినాయ్ రాష్ట్రానికి, అమెరికా ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయం" అని అభివర్ణించారు.
Donald Trump
US Supreme Court
Illinois National Guard
Chicago
Abigail Jackson
JB Pritzker
Federal troops
Supreme Court ruling
National Guard deployment
Illinois

More Telugu News