Nitin Nabin: పని ప్రారంభించిన బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నబీన్... రాహల్ గాంధీ, తేజస్విపై ఫైర్

Nitin Nabin Starts Work Fires at Rahul Gandhi Tejaswi Yadav
  • ఇటీవల బీజేపీ జాతీయ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్
  • రాహుల్, తేజస్వి యాదవ్ పార్ట్‌టైమ్ రాజకీయ నాయకులని విమర్శలు
  • బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపు
ఇటీవలే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్.. తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై దృష్టిసారించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరినీ 'పార్ట్‌టైమ్ రాజకీయ నాయకులు' అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు పూర్తికాలం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పాట్నా వచ్చిన ఆయనకు, మంగళవారం మిల్లర్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జాతీయ సంస్థలను, దేశాన్ని పదేపదే అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. "రాహుల్ గాంధీ దేశంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తారు. అదే విదేశాలకు వెళ్లినప్పుడు ఏకంగా దేశాన్నే కించపరిచేలా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులకు కచ్చితంగా శిక్ష పడాలి" అని అన్నారు.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరును ప్రస్తావించకుండా, ఆయనపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. "బిహార్‌లో మరో నేత ఉన్నారు. ఆయన కూడా పార్ట్‌టైమ్ రాజకీయాలే చేస్తుంటారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభను వదిలి వెళ్లిపోతారు" అని వ్యాఖ్యానించారు. శాసనసభ బాధ్యతల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నారు.

రాజకీయాల్లో షార్ట్‌కట్‌లు ఉండవని, దీర్ఘకాలిక లక్ష్యంతో నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బీహార్‌లో మొదలైన బీజేపీ విజయ పరంపర త్వరలోనే పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పదవిలో ఉన్నా, తన హృదయంలో పాట్నా, బీహార్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Nitin Nabin
BJP
Rahul Gandhi
Tejaswi Yadav
Bihar Politics
Indian Politics
BJP National Working President
Patna
Political Criticism
Part-time Politicians

More Telugu News