Chandrababu Naidu: కొత్త ఎలక్ట్రిక్ బస్సులు 'పల్లెవెలుగు' అయినా సరే ఏసీ ఉండాలి: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Orders AC Electric Buses Even for Palle Velugu
  • పల్లెవెలుగుతో సహా కొత్త ఈవీ బస్సులన్నీ ఏసీవే ఉండాలని సీఎం ఆదేశం
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,450 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం
  • ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఈవీ బస్సులు
  • గోదావరి పుష్కరాల కోసం జిల్లాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సూచన
ఏపీఎస్‌ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే అయ్యుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కొత్త ఎలక్ట్రిక్ బస్సు తప్పనిసరిగా ఏసీ సౌకర్యంతో ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ‘పల్లెవెలుగు’ బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సుల రోడ్‌మ్యాప్‌పై మంగళవారం నాడు సచివాలయంలో  సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,450 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాబోయే ఐదేళ్లలో మొత్తం 8,819 డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 8 ఏళ్లకు పైబడిన పాత బస్సులను కూడా ఈవీలుగా మార్చాలని నిర్దేశించారు.

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, గోదావరి జిల్లాల్లో ముందుగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకు సంబంధించిన టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి - మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు కొత్త బస్సులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
APSRTC
Electric Buses
Palle Velugu
Andhra Pradesh
AP RTC
Godavari Pushkaralu
Free Bus Travel for Women
EV Buses
Electric Vehicle

More Telugu News