Nidhhi Agerwal: లులు మాల్‌లో అసభ్య ప్రవర్తన.. ఫ్యాన్స్‌పై ఫిర్యాదు చేయడం ఇష్టంలేదన్న నటి నిధి అగర్వాల్

Nidhhi Agerwal Refuses to File Complaint After Incident at Lulu Mall
  • రాజాసాబ్ పాట విడుదల సందర్భంగా లులు మాల్‌కు వచ్చిన నిధి అగర్వాల్
  • ఈవెంట్ అనంతరం వెళుతుండగా ఆమెపై పడిన అభిమానులు
  • సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందిపడిన నిధి అగర్వాల్
  • ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదన్న నటి
లులు మాల్ వ్యవహారంలో తన పట్ల అభిమానులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు సినీ నటి నిధి అగర్వాల్ నిరాకరించారు. 'రాజా సాబ్' చిత్రం పాట విడుదల సందర్భంగా ఆమె లులు మాల్‌కు విచ్చేశారు. కార్యక్రమం అనంతరం ఆమె తిరిగి వెళుతుండగా, అభిమానులు ఆమె చుట్టూ గుమిగూడారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిధి అగర్వాల్‌కు అభిమానుల నుంచి కొంత అసభ్యకర ప్రవర్తన ఎదురైంది. 

ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే లులు మాల్‌తో పాటు శ్రేయాస్ మీడియాపై కేసు నమోదు చేశారు. అభిమానులు వ్యవహరించిన తీరుపై పోలీసులు నిధి అగర్వాల్‌ను సంప్రదించారు. అసౌకర్యానికి గురి చేసిన అభిమానులపై ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. అయితే, ఈ అంశంపై తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలుచుకోలేదని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు.

అయితే, సంఘటన జరిగిన ప్రాంతంలో సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల తాను ఇబ్బందికి గురైన మాట వాస్తవమని ఆమె పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. కాగా, నిధి అగర్వాల్ పట్ల సుమారు పదహారు మంది అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రం నుంచి రెండవ పాట విడుదల కార్యక్రమం కేపీహెచ్‌బీలోని లులు మాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్‌తో సహా చిత్ర యూనిట్ హాజరైంది. ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళుతుండగా ఒక్కసారిగా అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. ఆమె అతికష్టమ్మీద వారి నుంచి బయటపడి అక్కడి నుంచి నిష్క్రమించారు.
Nidhhi Agerwal
Nidhhi Agerwal Lulu Mall
Raja Saab Movie
Prabhas Raja Saab
Lulu Mall Hyderabad

More Telugu News