Sivaji: నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

Telangana Women Commission Reacts to Sivajis Controversial Statements
  • చిక్కుల్లో పడిన నటుడు శివాజీ  
  • హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో శివాజీపై వెల్లువెత్తిన విమర్శలు
  • రంగంలోకి దిగిన తెలంగాణ మహిళా కమిషన్
  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చైర్‌పర్సన్ నేరెళ్ల శారద
ప్రముఖ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చీర కట్టుకుంటేనే అందం కానీ, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం కాదు. అలాంటి వాళ్లను చూస్తే దరిద్రపు .. అని తిట్టాలనిపిస్తుంది... పైకి ఎవరూ అనకపోయినా లోపల మాత్రం తిట్టుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను తమ లీగల్ టీమ్ పరిశీలించిందని, ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు నటులు జాగ్రత్తగా ఉండాలని, మహిళలను అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద సహా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల దుస్తుల ఎంపికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి స్వేచ్ఛను హరించడమేనని, ఇది తిరోగమన ధోరణిని సూచిస్తుందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. మహిళా కమిషన్ నోటీసుల నేపథ్యంలో శివాజీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Sivaji
Sivaji actor
Telangana Women Commission
Narella Sharada
Dandora movie
Chinmayi Sripada
dress code comments
misogyny
women's rights
movie pre release event

More Telugu News