BR Naidu: వైకుంఠ ద్వార దర్శనాలపై వదంతులు నమ్మొద్దు: టీటీడీ చైర్మన్ స్పష్టత

BR Naidu urges devotees not to believe Vaikunta Dwara Darshan rumors
  • డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈ-డిప్ టోకెన్లు ఉన్నవారికే దర్శనం
  • జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేనివారికి సర్వదర్శనం
  • టోకెన్లు లేకున్నా తిరుమలకు రావొచ్చని స్పష్టం చేసిన టీటీడీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. దర్శనాల షెడ్యూల్‌పై ఆయన స్పష్టతనిస్తూ, భక్తులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని కోరారు.

డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో ఈ-డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ మూడు రోజుల్లో టోకెన్లు లేని వారికి దర్శనం ఉండదని, అయితే జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా దర్శించుకోవచ్చని తెలిపారు.

టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. దర్శనం లేనప్పటికీ, తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులను ఎవరూ అడ్డుకోరని భరోసా ఇచ్చారు. నకిలీ దర్శనం టికెట్ల అమ్మకాల వంటి ఘటనల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, భక్తుల రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్ నాయుడు వివరించారు. మంత్రుల సబ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులందరూ టీటీడీ సూచనలు పాటిస్తూ సంయమనంతో వ్యవహరించి, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.
BR Naidu
TTD Chairman
Tirumala
Vaikunta Dwara Darshanam
Tirupati
e-Dip tokens
Sarvadarshan
TTD
Fake tickets

More Telugu News