Manchu Lakshmi: సీఐడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
- బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు మంచు లక్ష్మి హాజరు
- ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారని ప్రశ్నించిన సీఐడీ
- ఇదే వ్యవహారంలో మంచు లక్ష్మిని గతంలో ప్రశ్నించిన ఈడీ
నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లక్డీకాపూల్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయడానికి మంచు లక్ష్మి ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు? అనే అంశాలపై సీఐడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే, ఆ యాప్‌ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరిగాయన్న వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
ఈ బెట్టింగ్ యాప్‌ల కేసు కొత్తది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మంచు లక్ష్మిని విచారించింది. అప్పట్లో ఆమె ఆర్థిక లావాదేవీలపై, యాప్‌ల ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. మంచు లక్ష్మి మాత్రమే కాకుండా, ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ తారలు విచారణకు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ నటులు గతంలో అధికారుల ఎదుట హాజరై తమ వివరణలు ఇచ్చిన విషయం తెలిసిందే.
నిషేధిత బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత తప్పుదోవ పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సెలబ్రిటీల ప్రమోషన్లపై చట్టపరమైన చర్యలు కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.