Anantapur district: కన్నబిడ్డలను కాలువలోకి తోసిన తండ్రి.. అనంతపురం జిల్లాలో దారుణం

Anantapur Father Throws Daughters in Canal One Dead
  • తప్పించుకుని పరిగెత్తినా లాక్కొచ్చి మరీ నీళ్లలో తోసిన కర్కోటకుడు
  • స్థానికుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • ఓ బాలిక మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే తన బిడ్డలను కాలువలోకి తోసేశాడు. ఒక బాలిక మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మరో బాలిక కోసం గాలిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్పకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు సింధు, అనసూయ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరు తరగతులు చదువుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కల్లప్ప తన కుమార్తెలు సింధు, అనసూయలను హెచ్ఎల్‌సీ కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. పెద్ద కుమార్తెను కాలువలోకి తోసేశాడు. ఇది చూసి భయంతో చిన్న కుమార్తె పరిగెత్తింది. అయినా వెంటాడి పట్టుకున్న కల్లప్ప.. ఆమెను కూడా కాలువలోకి తోసేశాడు.

కల్లప్ప కుమార్తెలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతడిని నిలదీశారు. వారిని కాలువలోకి తోసేశానని కల్లప్ప చెప్పాడంతో ఆందోళనకుగురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో కుమార్తెలను కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద హెచ్‌ఎల్‌సీ కాలువలోకి తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్ఎల్‌సీ కాలువలోకి తోసేశానని మరోసారి కల్లప్ప చెప్పి స్పృహ కోల్పోయాడు. దీంతో కల్లప్పను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. పిల్లల కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ గాలింపు చర్యల్లో అనసూయ మృతదేహం లభ్యమైంది. సింధు కోసం గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, కల్లప్ప ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం తెలియరాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లప్ప కోలుకున్న తరువాత అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. 
Anantapur district
Andhra Pradesh crime
HLC canal
infanticide
daughter murder
Kallappa
Nemakallu village
Bommanahal
Sirigeri cross
crime news

More Telugu News