Gold Prices: అంతర్జాతీయ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. కొత్త రికార్డులు సృష్టించిన బంగారం, వెండి ధరలు

Gold Prices Soar to Record Highs Amid Global Tensions
  • ఎంసీఎక్స్‌లో బంగారం రూ.1.38 లక్షలు, వెండి రూ.2.16 లక్షల రికార్డు ధ‌ర‌లు
  • అమెరికా-వెనిజువెలా ఉద్రిక్తతలతో సేఫ్ హేవన్ డిమాండ్ పెరుగుదల
  • డాలర్ బలహీనతతో బంగారం ధరలకు మద్దతు
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను కొత్త రికార్డు స్థాయులకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా అమెరికా-వెనిజువెలా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సేఫ్ హేవన్ డిమాండ్‌ను పెంచడంతో మంగళవారం బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే 1 శాతం కంటే ఎక్కువ పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1.2 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,38,381 వద్ద ఆల్‌టైమ్ హైను తాకాయి. ఇవాళ ఉదయం 10.48 గంటల సమయానికి ఇవి 1.01 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మరింత వేగంగా దూసుకెళ్లాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ 1.7 శాతం పెరిగి కిలోకు రూ.2,16,596 వద్ద కొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే సమయానికి వెండి ధరలు 1.30 శాతం లాభంతో కొనసాగాయి.

డాలర్ ఇండెక్స్ 0.20 శాతం తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఇతర కరెన్సీల్లో చౌకగా మారింది. దీనికి తోడు అమెరికా కోస్ట్ గార్డ్ వెనిజువెలా చమురు తరలిస్తున్న సూపర్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం, ఇతర నౌకలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు మార్కెట్లలో ఆందోళనను పెంచాయి. అలాగే, ఒక బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ హత్య కూడా భద్రతా భయాలను పెంచింది.

నిపుణుల ప్రకారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు, కేంద్ర బ్యాంకుల భారీగా బంగారం కొనుగోళ్లు, ఈటీఎఫ్‌లలో బలమైన పెట్టుబడులు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయంగా బంగారం ధరలు 76 శాతం పెరగగా, అంతర్జాతీయంగా దాదాపు 70 శాతం పెరిగాయి. వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా సుమారు 140 శాతం వరకు పెరగడం విశేషం.
Gold Prices
Silver prices
MCX
Commodity market
US Venezuela tensions
Geopolitical tensions
Safe haven demand
Investment
Commodity trading
Market trends

More Telugu News