AP Bar Council: ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్.. రూ.5.60 కోట్ల సంక్షేమ సాయం మంజూరు

AP Bar Council Announces Rs 560 Crore Welfare Fund for Lawyers
  • 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు మరణానంతర ప్రయోజనాలు
  • 137 మందికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం
  • నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ఏపీలో న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. లాయర్లకు మరణానంతర ప్రయోజనాలు, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కింద ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని, మొత్తం రూ.5.60 కోట్లకు పైగా నిధులను న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు మంజూరు చేసింది.

ఈ సమావేశంలో హైకోర్టు, ఏపీ న్యాయశాఖ ప్రతినిధులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి. నరసింగరావు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి, ఆమోదం తెలిపారు.

మరణానంతర ప్రయోజనాల కింద 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.3.51 కోట్లను మంజూరు చేశారు. అలాగే, తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందిన 137 మంది న్యాయవాదులకు వైద్య ఖర్చుల కోసం రూ.1.90 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద ఏడుగురు న్యాయవాదులకు రూ.19.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని కలిపి మొత్తం రూ.5,60,80,000 నిధులు న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు అందనున్నాయి.

ఈ ఆర్థిక సహాయం న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గిస్తుందని, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని సంక్షేమ కమిటీ పేర్కొంది. మంజూరైన నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం, బార్ కౌన్సిల్ తీసుకుంటున్న ఈ చర్యలు అభినందనీయమని పలువురు లాయర్లు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Bar Council
Andhra Pradesh lawyers
lawyer welfare fund
Nallari Dwarakanath Reddy
advocates welfare scheme
AP High Court
lawyers financial assistance
advocates retirement benefits
lawyers medical expenses

More Telugu News