Russia Bangladesh: భారత్– బంగ్లాల మధ్య ఉద్రిక్తతల వేళ రష్యా కీలక వ్యాఖ్యలు

Russian Envoy Alexander Grigorievich Khozin Urges Bangladesh to Reconcile with India
  • బంగ్లాదేశ్ స్వాతంత్ర్యద్యోమంలో భారత్ పాత్రను గుర్తు చేసుకోవాలని హితవు
  • సాధ్యమైనంత త్వరగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని సూచన
  • ఇరు దేశాల మధ్య స్థిరత్వం కోసం వైరాన్ని వీడాలన్న రష్యా రాయబారి
భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన విషయం విదితమే. అంతర్గత అశాంతితో పాటు ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కు బంగ్లాదేశ్ దూరమవుతోంది. భారత్ పట్ల శత్రుభావంతో వ్యవహరిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగొరివిచ్ ఖోజిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శత్రుత్వం మంచిది కాదంటూ బంగ్లాదేశ్ కు హితవు పలికారు. వైరాన్ని వీడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో భారత్ పాత్రను గుర్తు చేసుకోవాలని చెప్పారు.

ఢాకాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఖోజిన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ తో ఉద్రిక్తతలను ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది. 1971 లో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిందంటే కారణం భారతదేశం చేసిన సాయమేననే విషయం మర్చిపోవద్దు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అవసరమైన సాయం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉంది. భారత్, బంగ్లాదేశ్, రష్యా.. మూడు దేశాలు కలిసి పనిచేస్తూ అభివృద్ధి సాధించాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవడం ఆసియా ప్రాంతంలో స్థిరత్వానికి దోహదపడుతుంది” అని వ్యాఖ్యానించారు.

అదేసమయంలో భారత్, బంగ్లాదేశ్ ల ద్వైపాక్షిక సంబంధాల్లో రష్యా తలదూర్చాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు మరింత పెరగకూడదని రష్యా భావిస్తోందని, అవసరమైన పక్షంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుకు రావడానికి సిద్ధమని ఖోజిన్ స్పష్టం చేశారు.
Russia Bangladesh
India Bangladesh relations
Bangladesh tensions
Indo Bangladesh Conflict
Russian Ambassador
Dhaka
1971 Bangladesh Liberation War
Asia region stability
Alexander Grigorievich Khozin

More Telugu News