Poornima: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన మహిళ అరెస్ట్

Poornima Arrested for Husbands Murder in Medchal
  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన వైనం
  • గొంతుకు ఉరి బిగించడమే మృతికి కారణమని తేల్చిన వైద్యులు
  • హత్యలో పాలుపంచుకున్న ప్రియుడు, అతని స్నేహితుడు అరెస్ట్  
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య, గుండెపోటుతో మృతి చెందాడని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. పోస్టుమార్టం నివేదికతో భార్య చేసిన ఘాతుకం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ బృందావన్ కాలనీలో నివసిస్తున్న వీకే అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తుండగా, పూర్ణిమ ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. గత ఏడాది అదే కాలనీకి చెందిన పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని అనుమానించిన అశోక్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకుంటే తమ అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించిన పూర్ణిమ, మహేశ్‌తో కలిసి హత్యకు పథకం వేసింది.

అశోక్‌ను హత్య చేయడంలో సహాయం చేయాలని మహేశ్ తన స్నేహితుడు సాయికుమార్ (22)ను సంప్రదించగా అతడు అంగీకరించాడు. ఈ నెల 11న మధ్యాహ్నం మహేశ్, సాయి పూర్ణిమ ఇంటికి వచ్చి ఓ గదిలో దాక్కున్నారు. సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి అతడి చేతులు, కాళ్లు పట్టుకొని చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు.

ఆ తర్వాత అశోక్ గుండెపోటుతో మృతి చెందాడని పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతుకు ఉరి బిగించడమే మృతికి కారణమని తేలడంతో పోలీసులు అశోక్ భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో ఆమె నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు మొత్తం ఘటనను వివరించింది. దీంతో పోలీసులు పూర్ణిమతో పాటు మహేశ్, సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
Poornima
Medchal
Murder
Extra marital affair
Mahesh
Sai Kumar
Husband murder
Crime news
Telangana police
Boduppal

More Telugu News