Deepu Chandra Das: తోటి ఉద్యోగులే కాలయములు: హిందూ యువకుడిని కొట్టి చంపిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Dipu Chandra Das colleagues betrayed him Lynched in Bangladesh over Blasphemy Claim
  • దీపు చంద్రదాస్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు
  • పాశవికంగా కొట్టి చంపి, మృతదేహాన్ని నడిరోడ్డుపై వేలాడదీసి నిప్పు
  • రక్షించాల్సిన సహోద్యోగులే ఉన్మాదమూకకు అప్పగించిన వైనం
  • పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందన్న బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు
బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో దారుణ హత్యకు గురైన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి ఉద్యోగులే అతడిని ఉన్మాద మూకకు అప్పగించడంతో పాటు వారితో కలిసి అతడిపై దాడిచేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

మైమన్ సింగ్ జిల్లా భలుకాలోని 'పయనీర్ నిట్‌వేర్స్' గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర దాస్ (27) పనిచేసేవాడు. మతపరమైన వ్యాఖ్యలు (Blasphemy) చేశాడన్న అస్పష్టమైన ఆరోపణలతో గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత మొదలైంది. అయితే, అతడిని కాపాడాల్సిన ఫ్యాక్టరీ యాజమాన్యం, తోటి ఉద్యోగులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. దీపును కాపాడే అవకాశం ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు అతడితో బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత రక్షణ కల్పించాల్సింది పోయి, బయట వేచి ఉన్న ఉన్మాద మూకకు అతడిని అప్పగించారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం ఒక నిరపరాధిని బలి ఇచ్చారని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) పేర్కొంది.

కిరాతకం.. శవాన్ని వేలాడదీసి దహనం
ఉన్మాదుల చేతికి చిక్కిన దీపుపై వందలాది మంది విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగక, అతడిని చంపి, మృతదేహాన్ని ఢాకా-మైమన్‌సింగ్ హైవేపై వేలాడదీసి నిప్పుపెట్టారు. ఈ దారుణంలో దీపుతో కలిసి పనిచేసే కొందరు సహచరులు కూడా పాల్గొనడం గమనార్హం.

ఈ హత్య ఆవేశంలో జరిగింది కాదని, పక్కా ప్రణాళికతోనే జరిగిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకే గొడవ మొదలైనా, ఫ్యాక్టరీ యాజమాన్యం రాత్రి 8 గంటల వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. సకాలంలో ఫోన్ చేసి ఉంటే దీపు ప్రాణాలు దక్కేవని ఇండస్ట్రియల్ పోలీస్ సూపరింటెండెంట్ ఫర్హాద్ హుస్సేన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆధారాల్లేని ఆరోపణలు
దీపు మత విద్వేష వ్యాఖ్యలు చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు ధృవీకరించారు. సోషల్ మీడియాలో కూడా అతడు అటువంటి పోస్టులు పెట్టలేదని తేలింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఫ్యాక్టరీ అధికారులు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనాథగా మిగిలిన చిన్నారి
మూడేళ్ల క్రితమే పెళ్లైన దీపుకు ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ఉంది. తప్పుడు ఆరోపణలతో తన అన్నను పొట్టనబెట్టుకున్నారని, తన వదిన, చిన్నారి పరిస్థితి ఏంటని దీపు తమ్ముడు అపు చంద్ర దాస్ కన్నీరుమున్నీరవుతున్నాడు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై దాడులు, భారత వ్యతిరేక నిరసనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీపు చంద్ర దాస్ హత్య జరగడం అక్కడ నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది.
Deepu Chandra Das
Bangladesh
Hindu youth murder
Religious extremism
Blasphemy accusation
Mymensingh district
Pioneer Knitwears
Factory violence
Communal violence
Mohammad Yunus government

More Telugu News