Arjun Panwar: రోగిని చితకబాదిన డాక్టర్... తీవ్రంగా పరిగణించిన మంత్రి

Arjun Panwar assaulted by doctor at IGMC Shimla
  • సిమ్లాలోని ఐజీఎంసీలో దాడి ఘటన
  • వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగి అర్జున్
  • ఆసుపత్రికి రాగానే తన పట్ల డాక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడన్న అర్జున్
  • మర్యాదగా ప్రవర్తించమని అడిగినందుకు దాడి చేశాడని రోగి ఆరోపణ
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ)లో సోమవారం ఒక వైద్యుడు రోగిపై దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. వైద్య పరీక్షల నిమిత్తం అర్జున్ పన్వర్ అనే వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. సిమ్లా జిల్లాకు చెందిన అర్జున్ పన్వర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతడు ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఎండోస్కొపీ కోసం ఆసుపత్రికి వెళ్లిన అనంతరం, సిబ్బంది సూచన మేరకు అర్జున్ పన్వర్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఖాళీ బెడ్‌పై పడుకున్నాడు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన వైద్యుడు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడని అర్జున్ పన్వర్ ఆరోపించాడు. తాను మర్యాదగా ప్రవర్తించమని కోరినందుకు వైద్యుడు తనపై దాడి చేశాడని తెలిపాడు. పక్కనున్న వారు వైద్యుడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు బాధితుడిని కొడుతున్నట్లు, బాధితుడు కాలుతో వైద్యుడిని తన్నుతున్నట్లు వీడియోలో కనిపించింది.

ఈ ఘటన అనంతరం రోగి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ దాడిలో బాధితుడి ముక్కుకు గాయమైంది. బాధితుడు వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

అయితే, తొలుత రోగే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని వైద్యుడు పేర్కొన్నాడు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ధని రామ్ శాండిల్ స్పందించారు. రోగి పట్ల వైద్యుడి ప్రవర్తనను ఆయన ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Arjun Panwar
IGMC Shimla
Himachal Pradesh
Doctor Assault
Patient Beating
Dhani Ram Shandil

More Telugu News