Chandrababu Naidu: అమరావతిలో కల్చరల్ సెంటర్... సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం

Chandrababu Naidu Orders Cultural Center in Amaravati CRDA Meeting
  • అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • జోన్-8 ఎల్పీఎస్ లేఅవుట్ అభివృద్ధికి రూ.1358 కోట్ల కేటాయింపు
  • క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని సూచన
  • వివిధ అభివృద్ధి పనులకు 56వ సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం
  • రాజధాని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
రాజధాని అమరావతిలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీని కోసం వెంటనే అనువైన భూమిని గుర్తించాలని సూచించారు. నేడు సచివాలయంలో జరిగిన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధి పనులపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అమరావతిలో ఒక వేదిక ఉండాలి. రాష్ట్ర సంస్కృతికి అద్దంపట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలి. నిర్దేశిత గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వారి సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా పరిష్కరించాలి," అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు.

56వ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన అంశాలు

• అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ 2 ఎకరాల పరిధిలో రూ.103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్
• అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ.109 కోట్ల కేటాయింపు.
• శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం.
• హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు కేటాయింపు.
• 8400 క్యూసెక్కుల కెపాసిటీతో రూ.444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు.
• ఎల్పీఎస్ జోన్-8లో లే-అవుట్ల అభివృద్ధికి రూ.1358 కోట్లు కేటాయింపు.
• 202 ఎకరాల భూమి జరీబు లేదా మెట్ట ప్రాంతమా అని నిర్దారణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు. వ్యవసాయం, ఉద్యానవనం, భూగర్భ జలాలు, రెవెన్యూ, సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు.

ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Amaravati
CRDA
Cultural Center
Quantum Computing Center
AP CRDA Meeting
Andhra Pradesh
Capital Development
Infrastructure Development
Farmers Issues

More Telugu News