Brahmanandam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బ్రహ్మానందం భేటీ.. తాను గీసిన‌ చిత్రపటం అంద‌జేత‌

Brahmanandam Meets President Droupadi Murmu Gifts Painting
  • హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ముతో బ్రహ్మానందం భేటీ
  • బ్రహ్మానందాన్ని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన రాష్ట్ర‌ప‌తి
  • ప్రతిగా తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని రాష్ట్రపతికి బహూకరించిన బ్ర‌హ్మీ
టాలీవుడ్ హాస్యన‌టుడు బ్రహ్మానందం నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మానందాన్ని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రప‌టాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. అనంతరం ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీకి గల కారణం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. 

బ్ర‌హ్మీ కేవలం నటుడే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్‌లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీస్తారు. ఖాళీ సమయాల్లో తన మనసుకు నచ్చిన చిత్రాలను గీయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయా చిత్రాలను తనను కలిసే ప్రముఖులకు బహుమతిగా అందించడం బ్రహ్మానందం ప్రత్యేకత. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఆయన గీసిన చిత్రాలను అందించారు. 

కాగా, వయోభారంతో ఇటీవల సినిమాల సంఖ్య తగ్గించినా అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారాయన. తాజాగా విడుదలైన ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాలో ఆయన సందడి చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రపతితో స‌మావేశ‌మైన‌ ఈ సందర్భం బ్రహ్మానందం వ్యక్తిత్వానికి మరో గౌరవ ఘట్టంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Brahmanandam
Droupadi Murmu
President of India
Brahmanandam painting
Hanuman painting
Tollywood actor
Rashtrapati Nilayam
Gurram Papi Reddy
Telugu cinema
Indian artist

More Telugu News