Breast Cancer: భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ?.. బయటపడ్డ అసలు కారణాలివే!

ICMR Study Reveals Breast Cancer Risks in Indian Women
  • భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పుపై ఐసీఎంఆర్ అధ్యయనం
  • ఆలస్యంగా మెనోపాజ్, 30 ఏళ్ల తర్వాత గర్భం ప్రధాన కారణాలు
  • పొట్ట చుట్టూ కొవ్వు, కుటుంబ చరిత్ర కూడా కీలకమని వెల్లడి
  • పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర యువతుల్లోనే ఎక్కువ
  • 40 ఏళ్ల నుంచే స్క్రీనింగ్ అవసరమంటున్న నిపుణులు
భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) ముప్పునకు గల నిర్దిష్ట కారణాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న టాప్-3 క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటిగా ఉండగా, ఏటా దీని కేసులు 5.6 శాతం పెరుగుతున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్‌), బెంగళూరు బృందం ఈ పరిశోధన చేపట్టింది.

మ‌న‌ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలివే..
31 వేర్వేరు అధ్యయనాలను విశ్లేషించి, సుమారు 28,000 మంది మహిళల వివరాలతో ఈ నివేదికను రూపొందించారు. ఈ అధ్యయన ఫలితాలను 'క్యాన్సర్ ఎపిడెమియాలజీ' జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 30 ఏళ్లు దాటిన తర్వాత తొలిసారి గర్భం దాల్చడం, 50 ఏళ్ల తర్వాత మెనోపాజ్ దశకు చేరుకోవడం, అధికంగా అబార్షన్లు కావడం, పొట్ట చుట్టూ కొవ్వు (నడుము-తుంటి నిష్పత్తి 85 సెం.మీ. కంటే ఎక్కువ) పేరుకుపోవడం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వంటివి భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తేలింది.

జీవనశైలికి సంబంధించిన అంశాల్లో సరిగా నిద్రపోకపోవడం, లైట్లు వేసుకుని నిద్రించడం, తీవ్రమైన ఒత్తిడి కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో ఈ రిస్క్ తక్కువగా ఉన్నట్లు గమనించారు. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉండగా, 35-50 ఏళ్ల మధ్య వయసు వారిలో 1.63 రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు తెలిపారు.

పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన మహిళల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుండగా, భారతదేశంలో మాత్రం 40-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లోనే దీని ప్రాబల్యం అధికంగా ఉంది. జన్యుపరమైన అంశాలు, జీవనశైలి మార్పులే ఇందుకు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ మహిళలు 40 ఏళ్ల వయసు నుంచే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని వారు సూచించారు. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు వ్యూహాలను మరింత పక్కాగా రూపొందించడానికి దేశంలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. 
Breast Cancer
Indian women
ICMR
Cancer Epidemiology
Late marriage
Abortion
Lifestyle
Menopause
Obesity
Cancer screening

More Telugu News