Nara Lokesh: మంగళగిరితో పోటీ... ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తున్నా: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Accepts Challenge from Rajamundry MLA Adireddy Vasu
  • మంగళగిరితో పోటీ పడతామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ స్వీకరించిన లోకేశ్
  • కష్టకాలంలో అండగా నిలిచిన ఆదిరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని వెల్లడి
  • ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వ్యాఖ్యలు
  • జగన్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టీకరణ
  • వచ్చే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా
అభివృద్ధిలో, పార్టీ బలోపేతం చేసే విషయంలో మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతామంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన సవాల్‌ను తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రేమతో ప్రజల మనసులను గెలుచుకుంటూ, వారితో మమేకమై ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాజమండ్రిలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన రాజమండ్రి పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆదిరెడ్డి కుటుంబాన్ని జీవితంలో మర్చిపోలేనని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 

"చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అక్రమంగా ఇదే రాజమండ్రి జైలులో బంధించినప్పుడు ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. శాసనసభలో నా తల్లిని అవమానించినట్లే, ఆదిరెడ్డి భవానీ గారిని కూడా అవమానించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టినా, జై తెలుగుదేశం నినాదానికే ఆ కుటుంబం కట్టుబడింది. నాడు, నేడు, ఎప్పుడూ టీడీపీ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తుంది" అని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును తన కుటుంబ సభ్యుడిలా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకుంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని లోకేష్ తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. 

150 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. "ఏపీకి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాయకత్వం వల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి," అని అన్నారు.

'వైనాట్ 175' అన్నారు... ఇప్పుడు 'టీమ్ 11'కే పరిమితం అయ్యారు!

రాష్ట్రంలో ఓ సైకో ఇంకా అరెస్టులు చేస్తానని బెదిరిస్తున్నాడని, అలాంటి బెదిరింపులకు భయపడేది లేదని లోకేశ్ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "53 రోజులు మా నాయకుడిని జైల్లో పెట్టి ఏం సాధించారు? మీ కంటే ముందు చాలా మంది పెద్ద మాటలు మాట్లాడారు, వారి పరిస్థితి ఏమైందో గుర్తుంచుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు" అని హెచ్చరించారు. 'వై నాట్ 175' అన్నవారు ఇప్పుడు 'టీమ్ 11'కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

కూటమి మధ్య నో విడాకులు!

తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కుప్పం, హిందూపురంలాగే రాజమండ్రిని కూడా టీడీపీకి కంచుకోటగా మార్చాలని, చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

"కూటమి మధ్య నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది" అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Rajamundry
Adireddy Vasu
TDP
Telugu Desam Party
AP Politics
Coalition Government
Chandrababu Naidu
Mangalagiri

More Telugu News