Ashokanagar Higher Primary School: అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరితే బ్యాంకు ఖాతా తెరిచి, రూ.5 వేలు డిపాజిట్ చేస్తారు

Ashokanagar School Offers Fixed Deposit for New Students
  • ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థులు
  • మంగళూరులోని కన్నడ మాధ్యమ ప్రభుత్వ పాఠశాల వినూత్న ఆలోచన
  • దాతల సహకారంతో స్కూల్లో చేరిన వారికి రూ.5000 సహాయం
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు, హాజరు శాతం క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మంగళూరు జిల్లాలోని ఒక కన్నడ మాధ్యమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నమోదును ప్రోత్సహించడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.

సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అశోకనగర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల, కొత్తగా చేరిన విద్యార్థులకు ఉచిత బ్యాంకు ఖాతాలను తెరవడంతో పాటు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల విద్యను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ప్రతి విద్యార్థి పేరు మీద రూ. 5000 మొత్తాన్ని జమ చేస్తోంది.

పిల్లలను ఆకర్షించడానికి దాతల సహాయంతో ఉచిత బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఇలాంటి ప్రయోగం చేయడం జిల్లాలో ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం కోసం దీనిని మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

2025-26 విద్యా సంవత్సరానికి, 1 నుంచి 3 తరగతుల వరకు 17 మంది విద్యార్థులకు బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఒకటో తరగతిలో 10 మంది, రెండవ, మూడవ తరగతుల్లో ఏడుగురు విద్యార్థులు చేరారని, వారికి ఐదేళ్ల కాలానికి రూ.5 వేల చొప్పున నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఐదేళ్ల తర్వాత ఈ మొత్తం రూ.6,690కి పెరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా యక్షగానం, కరాటే, పెయింటింగ్, యోగాల్లో శిక్షణ ఇస్తున్నారు.
Ashokanagar Higher Primary School
Karnataka schools
government schools
student enrollment

More Telugu News