Komatireddy Venkat Reddy: సులభంగా, సౌకర్యవంతంగా సినిమాల నిర్మాణానికి తెలంగాణ అనుకూలం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy Says Telangana is Favorable for Film Production
  • ఐమ్యాక్స్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివెల్ ప్రారంభం
  • ఫెస్ట్ నిర్వహించడం తెలంగాణకు మైలురాయిగా పేర్కొన్న మంత్రి
  • రేపు, ఎల్లుండి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు సులభంగా, సౌకర్యవంతంగా నిర్మించుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సినిమా, టెలివిజన్ ఎకో సిస్టంను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఇక్కడ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం తెలంగాణకు ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. యువ ప్రతిభావంతులను వెలికితీయడానికి, కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేయడానికి లఘు చిత్రాలు దోహదపడతాయని ఆయన అన్నారు.

సినిమాలలో ప్రజల సంస్కృతి, జీవన విధానం ప్రతిబింబించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎఫ్‌డీసీ, దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఐమ్యాక్స్‌లో రేపు, ఎల్లుండి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. దాదాపు 10 దేశాల నుంచి 700కు పైగా లఘు చిత్రాలు ప్రదర్శనకు రాగా, జ్యూరీ సభ్యులు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తారు.
Komatireddy Venkat Reddy
Telangana cinema
Hyderabad International Short Film Festival

More Telugu News