Sudha Murthy: నేను చెబుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో మాయలో పడొద్దు: ఇన్ఫోసిస్ సుధామూర్తి

Sudha Murthy warns against deepfake investment video
  • పెట్టుబడి అవకాశాల కోసం లింక్‌పై క్లిక్ చేయమని ప్రజలను సుధామూర్తి కోరుతున్న డీప్‌ఫేక్ వీడియో
  • లింక్ నకిలీది కావడంతో స్పందించిన సుధామూర్తి
  • తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని ఎవరికీ సూచించలేదన్న సుధామూర్తి
రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి పెట్టుబడి అవకాశాల కోసం ఒక లింక్‌పై క్లిక్ చేయమని ప్రజలను కోరుతున్నట్లుగా ఉన్న ఒక డీప్‌ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ లింక్ నకిలీదని గుర్తించిన సుధామూర్తి ఈ విషయంపై స్పందించారు. తాను పెట్టుబడులు పెట్టాలని ఎప్పుడూ సూచనలు చేయలేదని, ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

"చాలామంది పెట్టుబడిదారులు ఇందులో చేరారు. నెలకు రూ. 10 లక్షల నుండి సంపాదిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మా బృందం ఇకపై కొత్త క్లయింట్ల ప్రవాహాన్ని నిలువరించలేకపోతున్నాము. అందుకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇందులో చేరాలనుకునే వారికి ఈరోజు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశం కల్పిస్తున్నాము. కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ పెట్టుబడిదారుల జాబితాలో చేరండి" అని ఆ డీప్‌ఫేక్ వీడియోలో సుధామూర్తి చెప్పినట్లుగా ఉంది.

ఈ వీడియోపై సుధామూర్తి స్పందిస్తూ డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని ఎవరికీ సూచించలేదని, ఇలాంటి వీడియోలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ వీడియోల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Sudha Murthy
Infosys Foundation
Deepfake video
Investment advice
Cyber crime
Social media

More Telugu News