Chandrababu: 'చిప్ టు షిప్' విజన్‌తో ఏపీ.. దుగరాజపట్నంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదన

Chandrababu Requests Central Assistance for AP Projects
  • కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు సాయం చేయాలని వినతి
  • నిలిచిన ఫిషింగ్ హార్బర్ల పనులకు నిధులు కోరిన సీఎం
  • మొత్తం రూ.590.91 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.

'చిప్ టు షిప్' విజన్‌లో భాగంగా రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) కూడా పూర్తయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును త్వరితగతిన ఆమోదించాలని కోరారు.

అనంతరం రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి చర్చించారు. ఫేజ్-1లో భాగంగా జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో రూ.1361.49 కోట్లతో పనులు చేపట్టగా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్రం నుంచి కేవలం జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే రూ.138.29 కోట్లు అందాయని, మిగిలిన మూడు హార్బర్లకు సాయం అందలేదని వివరించారు.

ఫేజ్-1 పనులు పూర్తి చేయడానికి ఇంకా రూ.440.91 కోట్లు అవసరమని, ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద మరో రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.590.91 కోట్లు సహాయంగా అందాల్సి ఉందని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న విధానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Chandrababu
Andhra Pradesh
Dugarajapatnam Port
Shipbuilding Cluster
Fishing Harbors
Sarbananda Sonowal
AP Reorganisation Act 2014
Sagarmala Scheme
Ports Shipping Waterways

More Telugu News