Harish Rao: పేద విద్యార్థిని కోసం సొంత ఇల్లు తాకట్టు పెట్టిన హరీశ్ రావు

Harish Rao Mortgages House for Poor Students Education
  • పేద టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్యకు ఆర్థిక కష్టాలు
  • ఆదుకునేందుకు ముందుకొచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు
  • సొంత ఇంటిని తాకట్టు పెట్టి రూ. 20 లక్షల లోన్ మంజూరు
  • వ్యక్తిగతంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం
  • హరీశ్ రావు దాతృత్వంపై సర్వత్రా ప్రశంసలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డురావడంతో, తన సొంత ఇంటినే బ్యాంకులో మార్టిగేజ్ చేసి విద్యా రుణం ఇప్పించారు. రాజకీయ నేతగా మాత్రమే కాకుండా మానవతావాదిగా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు.

వివరాల్లోకి వెళితే... సిద్దిపేటకు చెందిన టైలర్ కొంక రామచంద్రం కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నారు. అయితే, ఏటా రూ. 7.50 లక్షల ఫీజు చొప్పున మూడేళ్లపాటు చెల్లించాల్సి ఉండగా, ఆ కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదు. బ్యాంకులు కూడా ఆస్తులు లేకుండా రుణం ఇచ్చేందుకు నిరాకరించాయి. ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడటంతో ఏం చేయాలో తెలియక వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ కష్టాన్ని మమత తండ్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. సమయం తక్కువగా ఉండటంతో సిద్దిపేటలోని తన నివాసాన్ని యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి రూ. 20 లక్షల విద్యా రుణం మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజుల కోసం మరో లక్ష రూపాయలను తన సొంత నిధుల నుంచి అందించి ఆ విద్యార్థిని చదువుకు భరోసా ఇచ్చారు.

హరీశ్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో సిద్దిపేట ఆటో కార్మికుల సంక్షేమం కోసం కూడా ఇలాగే తన ఇంటిని మార్టిగేజ్ చేసి, వారి కోసం 'ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ' ఏర్పాటుకు తోడ్పడ్డారు. ఒక నిరుపేద విద్యార్థిని డాక్టర్ కావాలన్న కలను సాకారం చేసేందుకు హరీశ్ రావు చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Harish Rao
Harish Rao philanthropy
Telangana politics
education loan
MBBS student
Siddipet
medical education
student support
mortgage
charity

More Telugu News