Ram Gopal Varma: ఇది సినిమా కాదు, ఒక క్వాంటం లీప్.. 'ధురంధర్'కు రామ్ గోపాల్ వర్మ రివ్యూ

RGV Calls Dhurandhar a Quantum Leap in Indian Cinema
  • భారత సినిమా భవిష్యత్తును మార్చేసిందని కితాబు
  • దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా పొగిడిన వర్మ
  • కళ్లతోనే భావాలు పలికించాడంటూ రణ్‌వీర్‌పై ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రూపొంది, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం 'ధురంధర్'. ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. 'ధురంధర్' ఒక సాధారణ సినిమా కాదని, భారతీయ సినీ చరిత్రలో ఇదొక క్వాంటం లీప్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

దర్శకుడు ఆదిత్య ధర్ తన విజన్‌తో భారతీయ సినిమా భవిష్యత్తును ఒంటిచేత్తో మార్చేశారని వర్మ కొనియాడారు. "ఆదిత్య ధర్ కేవలం సన్నివేశాలను డైరెక్ట్ చేయలేదు. పాత్రలు, ప్రేక్షకుల మానసిక స్థితులను ఇంజనీరింగ్ చేశారు. ఈ సినిమా మన దృష్టిని శాసిస్తుంది" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కథ చెప్పడంలో అసలైన బలం శబ్దంలో కాదని, ఒత్తిడిని పెంచడంలో ఉంటుందని దర్శకుడు నిరూపించారని అన్నారు.

ఈ సినిమాలోని నటన, సాంకేతిక అంశాలను కూడా వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సాధారణంగా సినిమాల్లో యాక్షన్ దృశ్యాలను చప్పట్ల కోసం డిజైన్ చేస్తారు. కానీ ఇందులో హింస చాలా సహజంగా ఉంటుంది" అని వివరించారు. దర్శకుడు ప్రేక్షకులను తెలివైనవారిగా భావించి, వారికి కథను స్పూన్ ఫీడ్ చేయలేదని ప్రశంసించారు.

"హాలీవుడ్‌ను గుడ్డిగా కాపీ చేయాల్సిన అవసరం లేకుండా, మన నేటివిటీతోనే అంతర్జాతీయ స్థాయి సినిమా తీయొచ్చని ఆదిత్య ధర్ నిరూపించారు" అని వర్మ పేర్కొన్నారు. సినిమా పూర్తయ్యేసరికి కేవలం వినోదం పొందిన భావన కాకుండా, ప్రేక్షకుడిగా మనలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుందని తెలిపారు. తమలాంటి ఫిల్మ్ మేకర్లందరూ నిలబడిన పునాదిని ఆదిత్య ధర్ మార్చేస్తున్నారని ఆయన తన పోస్ట్‌లో ముగించారు.

Ram Gopal Varma
Dhurandhar
Ranveer Singh
Aditya Dhar
Bollywood
Movie review
Indian cinema
Box office
Film making
RGV

More Telugu News