రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
- ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ, నన్నయ్య వర్సిటీలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి
- పర్యటనలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం
- రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల నేతలతో సమావేశం
తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
అనంతరం రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ముందుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.