Donald Trump: రష్యా-ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు: ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns Russia Ukraine Conflict Could Lead to World War 3
  • గత నెలలోనే 25 వేల మంది మరణించారని ట్రంప్ ఆవేదన
  • ఇప్పటికైనా యుద్ధం, హత్యలు ఆగిపోవాలన్న ట్రంప్
  • మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవద్దని కోరుకుంటున్నానన్న ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం 'మూడవ ప్రపంచ యుద్ధం'గా పరిణామం చెందే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత నెలలోనే 25,000 మంది ప్రజలు, సైనికులు ఈ యుద్ధంలో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రక్తపాతం పట్ల ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా యుద్ధం, హత్యలు ఆగిపోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. లేదంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారు. ఇదే విషయాన్ని ఇదివరకు కూడా తాను చెప్పానని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, కానీ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే అంతా ముగిసిపోతుందని అన్నారు. అందుకే అలా జరగకూడదని తాను కోరుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ప్రాథమిక మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. మాస్కో, కీవ్ వైఖరుల పట్ల ట్రంప్ నిరాశగా ఉన్నారని, కేవలం సమావేశాలతోనే సరిపుచ్చడం ఆయనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. సమావేశాల ద్వారా ఫలితం రాకపోవడం పట్ల ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో ట్రంప్ రెండు దేశాల తీరుపై నిరాశగా ఉన్నారని లివిట్ వెల్లడించారు.
Donald Trump
Russia Ukraine conflict
Third World War
Russia
Ukraine
White House

More Telugu News