China: చైనా నిపుణులకు వేగంగా బిజినెస్ వీసాలు.. నిబంధనలు సడలించిన భారత్

India relaxes visa rules for Chinese business professionals
  • చైనా నిపుణులకు వేగంగా బిజినెస్ వీసాలు
  • నిబంధనలను సడలించిన భారత ప్రభుత్వం
  • గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా కీలక నిర్ణయం
చైనాకు చెందిన వృత్తి నిపుణులకు బిజినెస్ వీసాలను వేగంగా జారీ చేసేందుకు భారత ప్రభుత్వం నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్' ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.

ఈ కొత్త సడలింపుల వల్ల వీసా జారీలో అనవసర జాప్యం తగ్గిపోతుందని, వ్యాపార సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడకుండా ఉంటుందని అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొంది. వీసా ఆమోద ప్రక్రియను నాలుగు వారాలలోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారని, గతంలో ఉన్న కొన్ని పరిశీలన స్థాయులను కూడా తొలగించారని వారు వివరించారు.

ఈ ఏడాది ఆగస్టులో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన విషయం తెలిసిందే. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి, ప్రపంచ శాంతి కోసం అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఆ భేటీలో ఇరు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం తర్వాతే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం చైనా పౌరులకు ఇచ్చే వీసాలపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా బిజినెస్ వీసాల పరిశీలనను చాలా కఠినతరం చేసింది. తాజా నిర్ణయంతో వీసాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. 
China
China Business Visas
India China Relations
Narendra Modi
Xi Jinping
India Visa Policy
Business Visa Relaxation
Galwan Valley Clash
Shanghai Cooperation Organisation
India China Trade

More Telugu News