Nara Lokesh: విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh Inaugurates Cognizant Temporary Campus in Visakhapatnam
  • మధురవాడ ఫిన్‌టెక్ భవనంలో వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు
  • ఏడాదిలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్‌ను తీసుకొచ్చామన్న మంత్రి లోకేశ్‌ 
  • ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై దృష్టి
ఐటీ రంగంలో విశాఖ నగరం మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తన తాత్కాలిక క్యాంపస్‌ను ఇక్కడ ప్రారంభించింది. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

కాగ్నిజెంట్ సంస్థ తన శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తి చేసే వరకు ఈ తాత్కాలిక కేంద్రం నుంచే కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలపై దృష్టి సారించనుంది. కార్యక్రమానికి ముందు మంత్రి లోకేశ్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి లోకేశ్‌ మాట్లాడారు. కేవలం ఏడాది వ్యవధిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చామని గుర్తుచేశారు. "గతేడాది జనవరి 23న సంస్థ సీఈవో రవి గారిని కలిశాను. ఇప్పుడు మీరంతా చరిత్రకు సాక్షులుగా నిలిచారు. యువతే టార్చ్ బేరర్లుగా ఉండి, కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలవాలి" అని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh
Cognizant
Visakhapatnam
IT Sector
Andhra Pradesh
S Ravi Kumar
Dola Bala Veeranjaneya Swamy
Artificial Intelligence
Machine Learning
Digital Engineering

More Telugu News