Indigo: ఇండిగో సంక్షోభం.. డీజీసీఏ అధికారులపై వేటు

DGCA Sacks Flight Inspectors After Indigo Flight Cancellations
  • ఇండిగోను పర్యవేక్షిస్తున్న నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు
  • వేలాది విమానాలు రద్దు చేయడంతో డీజీసీఏ కఠిన చర్యలు
  • ఇండిగో కార్యకలాపాలపై రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు
  • రోజువారీగా 10 శాతం విమానాలు తగ్గించుకోవాలని ఆదేశం
  • ప్రయాణికులకు పరిహారం ప్రకటించిన ఇండిగో యాజమాన్యం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కఠిన చర్యలు చేపట్టింది. ఇండిగో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తొలగించింది. సరైన ప్రణాళిక లేకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో ఈ నెలలో ఇండిగో వేలాది విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో పదివేల మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను విచారణకు పిలవగా, ఈరోజు ఆయన మరోసారి అధికారుల ముందు హాజరుకానున్నారు. ఇన్‌స్పెక్టర్లు తమ పర్యవేక్షణ విధుల్లో విఫలమయ్యారని గుర్తించిన తర్వాతే డీజీసీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు గురుగ్రామ్‌లోని ఇండిగో కార్యాలయం నుంచి సంస్థ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తాయి. విమానాల లభ్యత, పైలట్లు, సిబ్బంది పని గంటలు, ప్రయాణికులకు రిఫండ్‌లు, పరిహారం వంటి అంశాలపై రోజూ సాయంత్రం 6 గంటలలోపు నివేదిక సమర్పిస్తాయి.

ఇండిగో తన రోజువారీ సర్వీసులను 10 శాతం తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. దీంతో రోజూ నడిచే 2,200 విమానాల్లో 200కు పైగా రద్దు కానున్నాయి. ఇండిగో యాజమాన్య వైఫల్యం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఛార్జీల నియంత్రణ, ప్రయాణికులకు సహాయక చర్యలు వంటి అన్ని ఆదేశాలను పాటించాలని ఆయన ఇండిగోను హెచ్చరించారు. మరోవైపు ఈ నెల‌ 3 నుంచి 5 మధ్య తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొన్న ప్రయాణికులకు పరిహారం అందిస్తామని ఇండిగో ప్రకటించింది.
Indigo
Indigo Airlines
DGCA
Flight Cancellations
Aviation Crisis
Peter Elbers
Ram Mohan Naidu
Flight Inspectors
Airlines
India

More Telugu News