Telangana Elections: లాటరీ తెచ్చిపెట్టిన పదవి.. స్థానిక పోరులో ఆసక్తికర సంఘటనలు

Telangana Local Elections Interesting incidents unfold
  • మెదక్ జిల్లాలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు
  • రంగారెడ్డి జిల్లాలో టాస్ గెలిచి సర్పంచ్ పదవి చేపట్టి..
  • సిరిసిల్లలో మరణించిన అభ్యర్థిని గెలిపించిన గ్రామస్థులు
తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ లో పలుచోట్ల ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు, లాటరీ ద్వారా సర్పంచ్ పదవిని దక్కించుకున్న అదృష్టవంతులు, కన్నుమూసినా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి.. ఇలా పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.
 
లాటరీ తెచ్చిపెట్టిన పదవి..
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లిలో ఇరువురు సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా అదే ఫలితం రావడంతో అధికారులు లాటరీ తీశారు. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్యను సర్పంచ్ పదవి వరించింది.

  • రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్నఎల్కచెర్లలో కూడా ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థుల సమ్మతితో అధికారులు టాస్ వేయగా.. కాంగ్రెస్ మద్దతుదారు మరాఠి రాజ్ కుమార్ గెలిచాడు.
  • పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయాగా బీఆర్ఎస్ కు చెందిన కొమురయ్య గెలుపొందారు.
  • ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానీ తండాలో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా 264 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ ద్వారా సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించారు. ఇందులో అదృష్టం కాంగ్రెస్ మద్దతుదారు మూడ్ చిన్నాను వరించింది.

ఒక్క ఓటే గెలిపించింది..
మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామంలో ఒక్క ఓటే సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించింది. కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పాండరికి 288 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుదారు హరిజన సత్తయ్యకు 287 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ జిల్లా లగచర్లలో 15 ఓట్ల తేడాతో వెంకట్రాములు గౌడ్ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.

ప్రచారంలోనే ప్రాణం పోయినా ఎన్నికల్లో విజయం వరించింది..
సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా గ్రామంలో మరణించిన అభ్యర్థి సర్పంచ్ గా గెలిచాడు. నామినేషన్ వేసి ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలోనే చెర్ల మురళి అనే అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. ఓట్ల లెక్కింపులో మురళికి అత్యధిక ఓట్లు రావడంతో అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు.

తల్లిని ఓడించిన కూతురు..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో సర్పంచ్ పదవి కోసం తల్లీకూతుళ్లు పోటీపడ్డారు. తల్లి గంగవ్వ, కుమార్తె సుమ హోరాహోరీగా తలపడగా.. చివరకు కుమార్తె సుమ 91 ఓట్ల తేడాతో తల్లిపై గెలిచింది.
Telangana Elections
Local Body Elections
Telangana Panchayat Elections
Medak
Sircilla
Lottery System
Election Results
Contesting Candidates
Telangana Politics
Village Elections

More Telugu News